Russia Nuclear Threat : ఉక్రెయిన్ వల్ల రష్యాకు ముప్పు వాటిల్లితే ఆ దేశంపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని రష్యా భద్రతా మండలి కార్యదర్శి దిమిత్రి మెద్వెదెవ్ అన్నారు. పశ్చిమ దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకునే సాహసం చేయవని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు.. మెద్వెదెవ్ అత్యంత సన్నిహితుడు.
కేవలం ఉక్రెయిన్ను భయపెట్టడానికే అణ్వాయుధాల గురించి రష్యా పదేపదే ప్రస్తావిస్తోందని పశ్చిమ దేశాలు అంటున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. రష్యా దురాక్రమణకు గురైనప్పుడు అణ్వాయుధాలను వాడతామని స్పష్టం చేశారు. 'అణ్వాయుధాల ప్రయోగం గురించి మేము ఊరికే చెప్పట్లేదు.. అవసరం అయితే తప్పకుండా వాటిని వాడతాం. అప్పుడు నాటో కూడా మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటుంది' అని తెలిపారు.
రష్యా దగ్గర ఎన్ని అణ్వాయుధాలంటే..
ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ లెక్కలు ప్రకారం.. రష్యా వద్ద మొత్తం 4,477 అణ్వాయుధాలు ఉన్నాయి. ఇక రష్యా వద్ద ఉన్న స్ట్రాటజిక్ శ్రేణి వార్ హెడ్‌లకు 500 కిలో టన్నుల నుంచి 800 కిలోటన్నుల శక్తి ఉంటుంది. వీటితో పెద్ద పట్టణాలను సైతం ధ్వంసం చేయవచ్చు.
అణ్వాయుధాన్ని రష్యా వాడితే..
ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఓటమిని తప్పించుకోవడానికి రష్యా అణ్వాయుధాలను వాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే పెద్ద అణ్వాయుధాలు వాడితే ప్రత్యర్థుల నుంచి ప్రతిదాడి జరగొచ్చు. గత వారం పుతిన్ హెచ్చరికలపై 'ది ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ నూక్లియర్ వెపన్స్' (ఐసీఏఎన్) అంచనా ప్రకారం ఐరోపాలో అణుపేలుడు.. జపాన్‌పై అణుదాడి కంటే తీవ్ర పరిణమాలను సృష్టిస్తుంది. వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది. అనేక దేశాలపై రేడియేషన్ ప్రభావం ప్రభావం పడుతుందని తెలిపింది.