Russia Missile Test Today : ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాశ్చాత్య దేశాల జోక్యం ఎక్కువైతే అణు యుద్ధానికి కూడా వెనకాడబోమని ఇప్పటికే హెచ్చరించిన రష్యా.. అణ్వస్త్ర ప్రయోగాలపై దృష్టి సారించడం కలకలం రేపుతోంది. అమెరికాతో సమానంగా అణ్వాయుధాల ఉత్పత్తి కోసం ఈ ఒప్పందం నుంచి వైదొలగిన క్రెమ్లిన్... అణు జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సముద్రం నుంచి ప్రయోగించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి బులావా ప్రయోగం విజయవంతమైందని రష్యా ప్రకటించింది. ఆర్కిటిక్ తీరంలోని యూరోపియన్ దేశాల వైపున ఉన్న సముద్రంలో దీన్ని పరీక్షించినట్లు తెలిపింది. అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించినట్లు వెల్లడించింది.
Russia Fired Intercontinental Ballistic Missile : ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాల నుంచి ముప్పు ఎదురవుతుందని భావిస్తున్న రష్యా మళ్లీ అణు పరీక్షల వైపు అడుగులు వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రష్యా, అమెరికాలు ఒకరితో ఒకరు పోటీగా అణు పరీక్షలు మొదలుపెడితే చైనా, భారత్, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అణు పరీక్షల పోటీని పెంచవచ్చని ఆయుధ నియంత్రణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ కూడా స్వయం నిషేధాన్ని పాటిస్తున్నాయి. అణ్వాయుధ పరీక్షల్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందాన్ని ఆమోదిస్తూ 2000 ఏడాదిలో చేసిన తీర్మానాన్ని తమ పార్లమెంట్ రద్దు చేసే అవకాశాలున్నాయని ఇటీవల పుతిన్ వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందంపై అమెరికా సంతకం చేసినప్పటికీ ఆ దేశ కాంగ్రెస్ ఇప్పటికీ ఆమోదించలేదని ఆయన గుర్తుచేశారు. తాము కూడా ఆ తరహాలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇటీవలే రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అణు పరీక్షలపై రష్యా చట్టపరమైన వైఖరిని మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గతంలో పుతిన్ తన అభిప్రాయాన్ని చెప్పినట్లుగానే అణు పరీక్ష నిషేధ ఒప్పందం రద్దు చేసేందుకు రష్యా పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. 1996లో ఈ ఒప్పందం అమెరికా సంతకం చేసినప్పటికీ, దాన్ని ఆమోదించలేదు. దీంతో రష్యా కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచం అమెరికా నుంచి ముప్పు ఎదుర్కొంటోందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ తెలిపారు.