UK PM Race Sunak : ప్రపంచంలో ఉత్తమ దేశంగా బ్రిటన్‌ను నిలబెట్టేందుకు రాత్రి, పగలు పనిచేస్తానని ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ప్రతిజ్ఞ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి పోటీలో ఉన్న సునాక్.. ఎన్నిక ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సందర్భంగా తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి పదవి చేపట్టే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 2 తుది గడువు కాగా.. ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం ఇరు నేతలు చివరి డిబేట్‌లో పాల్గొననున్నారు.
"ప్రపంచంలో ఉత్తమ దేశంగా బ్రిటన్ మరింత ఎదగడానికి, కుటుంబం మొదలు బిజినెస్ స్థాపన వరకు మన భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో స్వల్పకాలంలో ఎదురయ్యే సవాళ్లను నిజాయితీగా, విశ్వసనీయ ప్రణాళికతో ఎదుర్కొంటేనే మనం అక్కడికి చేరుకోగలం" అని రిషి సునాక్ పేర్కొన్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న ఆయన.. పన్నుల భారం లేని, ఉత్తమ ఆరోగ్యపథకం, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థలు ఉండడమే ముఖ్యమన్నారు. ఇలా బ్రిటన్‌ను ఉత్తమ దేశంగా నిలబెట్టేందుకు రాత్రి, పగలు కష్టపడతానన్నారు. ఇందుకోసం తాను అమితంగా ప్రేమించే దేశంతోపాటు పార్టీ విలువలకు అనుగుణంగా సరైన ప్రణాళికతో ముందుకెళ్తానని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా అనంతరం నూతన ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఇందుకోసం కన్జర్వేవిట్ పార్టీ నాయకుల్లో పలువురు పోటీలో దిగినప్పటికీ చివరకు రిషి సునాక్‌తోపాటు ట్రస్ లిజ్ మాత్రమే ప్రధాని అభ్యర్థి రేసులో మిగిలారు. ఇందులో భాగంగా తమ పార్టీ నాయకుడి ఎన్నిక కోసం టోరీ సభ్యులు(దాదాపు లక్షా 60వేల మంది) తమ ఓటు వేసేందుకు శుక్రవారం సాయంత్రం చివరి గడువు. ఇందులో భాగంగా బుధవారం నాడు రిషి సునాక్‌తోపాటు ట్రస్ లిజ్‌లో చివరిసారి టీవీ చర్చల్లో పాల్గొననున్నారు. ఇప్పటివరకు ఓటు వేయని టోరి సభ్యులు ఓటు వేయాలని సూచించనున్నారు. ప్రధాని అభ్యర్థి తుది ఫలితాన్ని సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. నూతన ప్రధాని కూడా అదేరోజు బాధ్యతలు చేపడతారు.
ఇవీ చదవండి: భారత్‌కు హైఅలర్ట్.. చినూక్ హెలికాప్టర్లను పక్కనపెట్టిన అమెరికా!
సోవియట్ యూనియన్ చివరి నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ కన్నుమూత