కాలిఫోర్నియాలో దుండగుడి కాల్పుల్లో ఏడుగురు మరణించిన ఘటన మరవకముందే అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్‌లోని యాకిమా ప్రాంతంలో ఉన్న ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొంత మంది గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. దుండగుడు మంగళవారం అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా స్టోరీలోకి ప్రవేశించి కొందరిపైకి కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారైయ్యాడు. పోలీసులు నిందితుడు ఆచూకి గుర్తించారు.
ఈ కాల్పులు జరిపింది స్థానికంగా ఉండే 21 ఏళ్ల జారిద్ హాడాక్గా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టిప్పటికీ నిందితుడు అక్కడలేడని గుర్తించారు. తాను చేసిన దశ్చర్య గురించి పశ్చాత్తాపం చెందుతూ.. తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటునట్లు తల్లికి ఫోన్ చేసి చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
"నిందితుడు స్టోర్‌లో కాల్పులు జరిపిన తర్వాత.. అక్కడ నుంచి పారిపోయి దగ్గర్లోని టార్గెట్ స్టోర్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ నుంచి ఫోన్ తీసుకుని.. తన తల్లికి కాల్ చేశాడు. 'నేను కొందరు వ్యక్తులను చంపాను. దానికి గాను నన్ను నేను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటున్నా' అని తల్లికి చెప్పాడు. అనంతరం ఆమె నిందితుడు నుంచి తన ఫోన్ తీసుకుని దూరంగా వెళ్లింది. వెంటనే ఆ మహిళ 911 నంబర్‌కు కాల్చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. అప్రమత్తమైన పోలీసుల వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటుండగా.. నిందితుడు తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు హాడాక్ మంగళవారం తెల్లవారుజామున 3: 30 గంటల సమయంలో కన్వీనియన్స్ స్టోర్‌లోకి ప్రవేశించి.. అక్కడ ఆహారం తింటున్న ఇద్దరిపై కాల్పులు జరిపాడు. ఆపై బయటకి వచ్చి కారులో వేరొకరిని కాల్చిచంపాడు. ఈ కాల్పుల్లో మరికొంత మంది గాయపడ్డారు"
-- మాట్ ముర్రే, యాకియా పోలీస్ చీఫ్
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కాల్పులు యాదృచ్ఛికంగా జరిగాయని.. మృతులకు, నిందితుడికు మధ్య ఎటువంటి వ్యక్తిగత తగాదాలు లేనట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే మృతుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే మంగళవారం ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో మూడు చోట్ల కాల్పులు జరగగా.. 7 మంది మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.