Putin Prigozhin Meeting : రష్యాపై తిరుగుబాటు ప్రయత్నం చేసిన తర్వాత వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌తో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా భేటీ అయ్యారట. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ సోమవారం వెల్లడించారు. జూన్ 29న జరిగిన ఈ భేటీలో ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్ గ్రూప్ కమాండర్లు కూడా పాల్గొన్నట్లు దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.
Prigozhin Wagner Group : పుతిన్ ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూపు.. జూన్ 24న రష్యా అధినేతపైనే తిరుగుబాటుకు యత్నించింది. ఈ క్రమంలోనే పుతిన్-ప్రిగోజిన్‌ల మధ్య బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి తిరుగుబాటుకు అడ్డుకట్ట వేశారు. అయితే, ఈ పరిణామాలు జరిగిన సరిగ్గా ఐదు రోజుల తర్వాత జూన్ 29న పుతిన్, ప్రిగోజిన్ భేటీ అయినట్లు దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగిందని ఆయన వెల్లడించారు.
Wagner Group Mercenaries : ఈ సమావేశంలో భాగంగా ఉక్రెయిన్ యుద్ధభూమిలో వాగ్నర్ గ్రూప్ చర్యలు, జూన్ 24 నాటి సంఘటనల గురించి పుతిన్ చర్చించినట్లు తెలిపారు. వాగ్నర్ కమాండర్ల వివరణను విన్న అధ్యక్షుడు పుతిన్.. యుద్ధంలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వారికి కొన్ని సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. 'తిరుగుబాటు యత్నానికి దారితీసిన పరిస్థితులను కమాండర్లు వివరించారు. అయితే తాము రష్యాకు ఎప్పటికీ సైనికులమేనని బలంగా చెప్పారు. మాతృభూమి కోసం ఉక్రెయిన్‌లో పోరాటాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు' అని క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న వాగ్నర్ గ్రూపు.. తిరుగుబాటు ప్రయత్నంలో భాగంగా రొస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. అక్కడ యుద్ధ ట్యాంకులు సహా సైనిక వాహనాలు తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. తాము చేస్తున్నది న్యాయం కోసం పోరాటమేనని, తిరుగుబాటు కాదని ప్రిగోజిన్ అప్పట్లో పేర్కొన్నారు. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. చివరకు వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్.. రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాలను వెనక్కు తీసుకునేందుకు అంగీకరించినట్లు ప్రకటించడంతో తిరుగుబాటు యత్నానికి బ్రేక్ పడినట్లయ్యింది.