Gotabaya Rajapaksa Singapore: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సింగపూర్‌కు చేరుకున్నారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఆయన తన వ్యక్తిగత పర్యటన కోసం అనుమతి తీసుకున్నారని, ఆశ్రయం కోరలేదని స్పష్టం చేసింది.
అనంతరం కొద్దిసేపటికే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాజపక్స. ఈ మేరకు పార్లమెంట్ స్పీకర్ మహింద అభయవర్ధనకు మెయిల్లో రాజీనామాను పంపించారు.
పలు మీడియాలు తెలిపినట్లుగా.. ఆయన సౌదీకి వెళ్లట్లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల క్రితం శ్రీలంక అధ్యకుడు రాజపక్స.. కొలంబో నుంచి మాల్దీవులకు పారిపోయారు.
అధ్యక్షుడు గొటబాయ, ఆయన సతీమణి, వారి వెంట ఇద్దరు భద్రతా సిబ్బంది మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక వైమానిక దళం బుధవారం ఓ సంక్షిప్త ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ అభ్యర్థన, అధ్యక్షుడిగా గొటబాయకు ఉన్న అధికారాలు, రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి మేరకే కటునాయకె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు వారిని మాల్దీవులకు తరలించినట్లు వివరించింది. అక్కడినుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎస్వీ 788లో సింగపూర్ చేరుకున్నట్లు తెలిసింది.
అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని రణిల్ విక్రమసింఘేను గద్దె దింపాలని నిరసనలు ప్రారంభించిన శ్రీలంక ప్రజలు.. ఆ క్రమంలో అధికారిక నివాసాలను ఆక్రమించారు. తాజాగా వాటిని ఖాళీ చేసేందుకు గురువారం అంగీకరించారు. అయితే, తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షుని భవనం, గాలే ఫేస్(నిరసనలు తెలిపే స్థలం) నుంచి మాత్రం వెళ్లబోమని తెలిపారు. బుధవారం బాష్పవాయువు గోళాలు, జల ఫిరంగులను లెక్కచేయకుండా కొలంబోలోని ప్రధాని కార్యాలయంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. భవనంపైకి చేరుకొని జెండాలు ఎగరవేశారు. ఈ ఘర్షణలో 84 మంది గాయపడ్డారు. మరోవైపు ప్రధాన మంత్రి కార్యాలయానికి శ్రీలంక ఆర్మీ రక్షణగా ఉంది. ప్రధాని కుర్చీకి జవాన్లు కాపలా కాస్తున్నారు.
ఇవీ చదవండి: