Deaths due to pollution: అన్నిరకాల కాలుష్యాల కారణంగా భారత్‌లో ఒక్క (2019) ఏడాదిలోనే 23లక్షల అకాల మరణాలు సంభవించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో 16లక్షల మంది కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో కాలుష్యం కారణంగా 90లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు పేర్కొంది. ఇలా ఓవైపు ప్రాణనష్టంతో పాటు అకాల మరణాలతో ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన తాజా అధ్యయనం ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే..
వివిధ రకాల కాలుష్యాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2019 సంవత్సరంలో 90లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. విశ్వవ్యాప్తంగా ప్రతి ఆరు మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. కేవలం వాయు కాలుష్యం కారణంగానే ప్రపంచంలో ఒక్క ఏడాదే 66లక్షల మంది బలయ్యారు. నీటి కాలుష్యంతో 13లక్షలు, సీసం కారణంగా తొమ్మిది లక్షలతోపాటు మరో 8.7లక్షల మంది ఇతర విషపూరిత వాయువుల కారణంగా చనిపోయారు. ఇక భారత్‌లో వాయుకాలుష్యం కారణంగా మరణించిన వారిలో అత్యధికంగా 9.8లక్షల మంది పీఎం2.5 వల్లే అకాల మరణం చెందారు.
ఉత్తరాదిలోనే ఎక్కువ
భారత్‌లో ముఖ్యంగా ఉత్తరాదిన ఈ కాలుష్య ప్రభావం అధికంగా ఉందని తాజా నివేదిక గుర్తు చేసింది. విద్యుత్తు, పరిశ్రమలు, వ్యవసాయ కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం అక్కడ తీవ్రంగా ఉందని పేర్కొంది. ఇళ్లలో వంటచెరకు మండించడం భారీ స్థాయిలో వాయుకాలుష్య మరణాలకు కారణంగా నిలుస్తోందని తెలిపింది. వీటితోపాటు బొగ్గు, పంట వ్యర్థాలను కాల్చడం వంటివి తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. కాలుష్య నియంత్రణకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సరైన కేంద్రీకృత వ్యవస్థ లేదన్న విషయాన్ని తాజా అధ్యయనం ఎత్తి చూపింది. భారత్‌లో ప్రమాదకర పీఎం2.5 స్థాయిలు మాత్రం డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల కంటే చాలా అధికంగా ఉన్నాయంటూ అప్రమత్తం చేసింది.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
ప్రజారోగ్యంపై కాలుష్యం ప్రభావం అపారంగా ఉందని.. తక్కువ, మధ్య ఆదాయ దేశాలపై ఈభారం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన స్విట్జర్లాండ్‌కు చెందిన గ్లోబల్ అలయన్స్ ఆన్ హెల్త్ అండ్ పొల్యూషన్ నిపుణులు రిచర్డ్ ఫ్యుల్లర్ పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రమైన విషయమైనప్పటికీ కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవడం లేదన్నారు. అయితే, వీటిపై ప్రజల్లో అవగాహన తేవడంలో ఇటీవల పురోగతి సాధించినప్పటికీ వాటికి అవసరమైన నిధులు కేటాయింపులో పెరుగుదల నామమాత్రంగానే ఉందన్నారు.
ఇదిలాఉంటే, అత్యంత జనాభా కలిగిన భారత్, చైనా దేశాలు కాలుష్య మరణాల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో సుమారు 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా చైనాలోనూ 22 లక్షల మంది అకాల మరణం చెందారు. అమెరికాలోనూ లక్షా 42వేల మంది బలయ్యారు. అన్ని రకాల కాలుష్యాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతిఏడాది ప్రతి లక్ష మందికి సగటున 117 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటిలో అత్యధికంగా సెంట్రల్ ఆఫ్రికా దేశమైన చాద్‌లో ప్రతి లక్ష మందికి 300 మంది చనిపోతుండగా అతి తక్కువ కాలుష్య కారక మరణాలు బ్రునై, ఖతార్, ఐస్‌లాండ్‌లలో చోటుచేసుకుంటున్నాయి.
ఇదీ చూడండి: 'భారతీయులకు రెండో అతిపెద్ద ముప్పు అదే'
'టీకా వేస్ట్.. ఉప్పు నీళ్లే బెస్ట్'.. ఊర మాస్ చిట్కాలతో కరోనాపై కిమ్ ఫైట్!