Posthumous Degree to Jaahnavi Kandula : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులకు మరణాంతర డిగ్రీ అందనుంది. జాహ్నవి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీ ఛాన్సలర్.. ఆమెకు మరణానంతర డిగ్రీని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జాహ్నవి తరపున ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్ఎస్ పట్టా అందజేస్తామని తెలిపారు. జాహ్నవి మరణం అనంతరం జరిగిన పరిణామాలతో తమ క్యాంపస్‌లోని భారత విద్యార్థులు తీవ్రంగా ప్రభావితులయ్యారని వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఈ సమయంలో భారత విద్యార్థులకు అండగా ఉంటామన్న వీసీ.. ఈ ఘటనలో బాధ్యులకు తప్పకుండా శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని తాము నిర్ణయించామని ఆమె కుటుంబంసభ్యులకు దాన్ని అందజేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు చెందిన జాహ్నవి.. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం కింద 2021లో అమెరికా వెళ్లింది. సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ఈస్ట్రన్ యూనివర్సిటీలో ఎమ్ఎస్ చేస్తుండేది. ఈ ఏడాది డిసెంబర్లో జాహ్నవి డిగ్రీ పూర్తి కావాల్సి ఉంది. ఈలోపే ఆమెను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ ఏడాది జనవరి 23న రాత్రి కళాశాల నుంచి ఇంటికి వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు విడిచారు.
Jahnavi Kandula Seattle Accident : జాహ్నవి మరణానంతరం సియాటిల్ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ, నవ్వుతూ మాట్లాడారు. ఆ మాటలన్నీ అతడి శరీరానికి అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. అవి తాజాగా వెలుగులోకి రావడం వల్ల భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలోనూ దీనిపై వ్యతిరేకత వచ్చింది. దీంతో పోలీసు అధికారి తీరుపై అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద సమయంలో పోలీసు అధికారి కెవిన్ డేవ్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవిని ఢీకొట్టగా.. ఆమె 100 అడుగుల దూరం ఎగిరిపడినట్లు సియాటిల్ పోలీసు విభాగం తెలిపింది.