PM Modi in Germany: మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... జర్మనీకి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత దిల్లీ నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. సోమవారం ఉదయం 9.42 గంటలకు జర్మనీలో దిగారు. ఆ దేశ ఉన్నతాధికారులు మోదీకి సాదరస్వాగతం పలికారు. జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్‌తో మోదీ సమావేశం కానున్నారు.
భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) ఆరో సమావేశానికి ఇరువురు దేశాధినేతలు అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరవుతారు. ఈ కార్యక్రమం అనంతరం ఉన్నతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ, షోల్జ్ పాల్గొంటారు. రెండు దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముచ్చటించనున్నారు. రాత్రి 10 గంటలకు భారత సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ గౌరవార్ధం స్కోల్జ్ ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు.
డెన్మార్క్ ప్రధాని మెటె ఫెడరిక్సన్ ఆహ్వానం మేరకు మోదీ మంగళవారం కోపెన్‌హేగన్ చేరుకోనున్నారు. అక్కడ రెండో భారత్-నార్డిక్ సదస్సులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. 2018లో జరిగిన తొలి భారత్-నార్డిక్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల ప్రగతిని ఈ సందర్భంగా సమీక్షించనున్నారు. డెన్మార్క్ నుంచి భారత్ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ని ప్రధాని కలవనున్నారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి విజయం సాధించినందుకు మెక్రాన్‌ను అభినందించనున్నారు.
ఇదీ చదవండి: Modi Europe Trip: 'ఐరోపాతో బంధం పటిష్ఠం చేసుకుంటాం'