US Green Card News : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు ముందు.. బైడెన్ సర్కార్ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. అమెరికాలో శాశ్వత నివాసం జారీ చేసే గ్రీన్ కార్డు అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కోరికను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్-గ్రీన్ కార్డులను జారీ చేస్తారు.
US Eases Green Card Eligibility Norms : అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతియేటా సుమారు 1,40,000 గ్రీన్ కార్డులను జారీచేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్ కార్డులను జారీ చేస్తారు. ప్రస్తుతం మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయిస్తున్నారు. ఈఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం గ్రీన్ కార్డు జారీ చేస్తున్నారు. తాజాగా ఈఏడీ నిబంధనలను సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది. గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా నూతన మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేవారి సంఖ్యను పెంపొందించేందుకు తాజా నిర్ణయం దోహదం చేస్తుందని భావిస్తున్నారు.
PM Modi America Visit : అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు ఈనెల 21 నుంచి 24 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలోనూ ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ గౌరవ సూచికంగా వైట్‌హౌస్‌లో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
Modi US Visit 2023 Schedule : జూన్ 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు న్యూయార్క్‌లో ఈ యోగా సెషన్ జరగనుంది. ఇందులో ఐరాస ఉన్నతాధికారులు, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొననున్నారు. జూన్ 22వ తేదీనే అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. జూన్ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి ప్రధానికి ఆతిథ్యమివ్వనున్నారు. వాషింగ్టన్‌లో అధికారిక కార్యక్రమాలతో పాటు పలు భేటీల్లో మోదీ పాల్గొననున్నారు. కంపెనీల సీఈవోలు, పలు రంగాల నిపుణులతో ఆయన చర్చలు జరపనున్నారు. ప్రవాస భారతీయులతో ముచ్చటించనున్నారు. అమెరికా పర్యటన నుంచి ప్రధాని నేరుగా ఈజిప్టు వెళ్లనున్నారు. జూన్ 24, 25 తేదీల్లో ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు.