Plane Door Blown Mid Air : గగనతలంలో ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ విమానం డోర్ ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో 16 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది. ఊడిన డోర్ పక్కనే ప్రయాణికులు సీట్లు ఉండగా కొందరి ఫోన్లు బయటకు ఎగిరి పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
'AS1282 విమానం పోర్ట్‌లాండ్ నుంచి ఒంటారియో బయలుదేరిన కొద్దిసేపటికే సమస్య తలెత్తింది. దాంతో విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశాం. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం' అని అలస్కా ఎయిర్‌లైన్స్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దీనిపై యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్‌టీఎస్‌బీ) కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది.
మరోవైపు, డోర్ ఊడిపోయిన ఘటనతో అలస్కా ఎయిర్‌లైన్స్ తమ వద్ద ఉన్న బోయింగ్ 737-9 విమాన సర్వీసులను నిలిపివేసింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్ CEO బెన్ మినికుచ్చి ప్రకటించారు. ప్రతి ఒక్క విమానాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి, భద్రతా ప్రమాణాలపై అధ్యయనం చేయిస్తామని తెలిపారు. మరోవైపు, బోయింగ్ సంస్థ కూడా విమాన డోర్ ఊడిపోయిన ఘటనపై స్పందించింది. ఇందుకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నామని, ఈ ఘటనలో దర్యాప్తునకు పూర్తిగా సహరిస్తామని తెలిపింది.
US Plane Crash Into Sea : గతేడాది నవంబరులో అగ్రరాజ్యం అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ(P-8A) భారీ నిఘా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి గగనతలంలోకి ఎగిసిన కొద్దిసేపటికే అదుపు తప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అమెరికా హవాయీ రాష్ట్రంలోని మెరైన్ కోర్ బేస్‌లో ఈ ప్రమాదం జరిగినట్లుగా కోర్ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్ ధ్రువీకరించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Plane Crash In Brazil Amazon : అమెజాన్ అడవుల్లో కూలిన విమానం.. 12 మంది దుర్మరణం
Brazil Plane Crash Today : అడవిలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు సిబ్బంది సహా 14 మంది దుర్మరణం