Pig Kidney Transplant To Human Successful : బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ వైద్యులు. గత నెలరోజులుగా ఆ అవయవం చక్కగా పనిచేస్తోంది. తమ పరిశోధన మంచి ఫలితాలు ఇవ్వడం పట్ల వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనతో మానవుల అవయవాల కొరతను అధిగమించడానికి చేస్తున్న కృషిలో వైద్యులు కీలక పురోగతిని సాధించారు. అయితే గతంలోనూ వైద్యులు ఇలాంటి ప్రయత్నం చేశారు. కానీ ఆప్పుడు పంది కిడ్నీ రెండు రోజులకు మించి పనిచేయలేదని.. ఇప్పుడు ఏకంగా నెల రోజులుగా పనిచేయడం అద్భుతమేనని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మాంట్గోమెరి తెలిపారు.
Pig Kidney Transplant NYU : మనుషులకు జంతువుల అవయవాలను అమర్చడంలో ఇదో ముందడుగని నిపుణులు అభివర్ణించారు. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన అవయవం ఎలా పనిచేస్తుందో రెండో నెలలోనూ పరిశీలిస్తామని డాక్టర్ రాబర్ట్ వెల్లడించారు. బ్రెయిన్‌డెడ్ అయిన 57 ఏళ్ల వ్యక్తి శరీరాన్ని ఆయన కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ప్రయోగానికి ఎంచుకున్నట్లు తెలిపారు. జులై 14న పంది మూత్రపిండాన్ని అమర్చగా.. రెండో రోజు నుంచి మూత్రం విడుదలవుతోందని వెల్లడించారు. గత ఏడాది మేరీలాండ్ వర్సిటీ వైద్యులు జన్యుమార్పిడి చేసిన పంది గుండెను ఓ వ్యక్తికి అమర్చి చరిత్ర సృష్టించారు. ఆ వ్యక్తి రెండు నెలలు మాత్రమే జీవించారు. అయితే ట్రాన్స్‌ప్లాంట్ చేసిన పంది కిడ్నీ.. సహజ మూత్రపిండంగా పనిచేస్తోందా? అని అడిగిన ప్రశ్నకు.. ఇప్పటివరకు అలాగే పనిచేసిందని డాక్టర్ రాబర్ట్ సమాధానమిచ్చారు. మానవ కిడ్నీ కంటే మెరుగ్గా కనిపిస్తోందన్నారు.
దీనిపై బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి సోదరి స్పందించారు. 'నా సోదరుడికి ఇతరులకు సహాయం చేయడం అంటే ఇష్టం. అతడు కోరుకునేది కూడా ఇదే అని నేను అనుకుంటున్నాను. అందుకే నా సోదరుడిపై ఈ పరిశోధన చేయడానికి అనుమతించాను. అతడు వైద్య పుస్తకాలలో ఉండబోతున్నాడు. దీని వల్ల అతడు ఎప్పటికీ జీవించి ఉంటాడు' అని చెప్పారు.