Pig Heart Transplant To Human : అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ వైద్యులు మరోసారి కీలకమైన అవయవమార్పిడి శస్త్ర చికిత్స చేశారు. మరణం ముప్పును ఎదుర్కొంటున్న ఓ 58 ఏళ్ల వ్యక్తిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు. శస్త్ర చికిత్స జరిగిన రెండు రోజుల అనంతరం.. ఆ వ్యక్తి సరదాగా జోకులు వేస్తున్నాడని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా కుర్చీలోనూ కూర్చోగలిగాడని చెప్పారు.
Pig Heart In Human : అయితే రానున్న కొన్ని వారాలు అత్యంత క్లిష్టమైనవని.. ఆయన ప్రస్తుతం స్పందిస్తున్న తీరుతో ఆశ్చర్యానికి గురైనట్లు వైద్యులు పేర్కొన్నారు. అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్ల పంది గుండెను అమర్చినట్లు వైద్యులు వివరించారు. గతేడాది ఇదే మేరీల్యాండ్ వైద్యుల బృందం ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను మరణ ముప్పు ఎదుర్కొంటున్న డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి మార్పిడి చేసింది. అయితే చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Pig Kidney Transplant In Human : అమెరికాలో 2నెలలక్రితం బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ప్రయోగాన్ని న్యూయార్క్ విశ్వవిద్యాలయం వైద్యులు ఇటీవలే ముగించారు. పంది కిడ్నీని తొలగించి.. వైద్య పరిశోధనల కోసం దానం చేసిన శరీరాన్ని అంత్యక్రియల కోసం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన వ్యక్తిలో ట్రాన్స్‌ప్లాంట్ చేసిన పంది మూత్రపిండం గతంలో కంటే ఎక్కువ రోజులు పనిచేయటం ఇదే మొదటిసారి. చనిపోయిన వ్యక్తిపై జరిపిన ఈ పరిశోధన ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్న వైద్యులు.. త్వరలో జీవించి ఉన్నవారిలోను పంది మూత్రపిండాలను ట్రాన్స్‌ప్లాంటు చేయాలనే ఆశతో.. ఆ వివరాలు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌తో పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు.
Pig Kidney Transplant 2023 : జినో ట్రాన్స్‌ప్లాంటేషన్ అని పిలిచే ఈ ప్రయోగం కొన్ని దశాబ్దాలపాటు విఫలమైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ వెంటనే... జంతువుల కణజాలాన్ని నాశనం చేసేది. పందులను జన్యు మార్పిడి చేయటం వల్ల వాటి అవయవాలు మానవుల మాదిరిగానే ఉంటాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇది సాధ్యమేనని.. తాము తెలుసుకున్నట్లు న్యూయార్క్ వర్సిటీకి చెందిన వైద్యులు తెలిపారు. కొన్ని స్వల్పకాలిక ప్రయోగాల్లో.. చనిపోయిన శరీరాల్లో రోగనిరోధక వ్యవస్థ వెంటనే దాడిచేయకుండా తప్పించగలిగినట్లు చెప్పారు. అయితే తిరస్కరణ సాధారణ రూపంపై స్పష్టత లేనప్పటికీ.. అందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.