Pakistan Caretaker Prime Minister 2023 : పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా సెనేటర్ అన్వర్-ఉల్-హక్ ఎంపికయ్యారు. ఈ ఏడాది చివర్లో జరిగే సాధారణ ఎన్నికల వేళ.. ఆయన తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించనున్నారు. మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్.. రెండు రౌండ్ల చర్చల తర్వాత అన్వర్-ఉల్-హక్ పేరు ఖరారు చేశారు. బలూచిస్థాన్ అవామీ పార్టీ-BAPకి చెందిన అన్వర్-ఉల్-హక్, ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతారు. ఈ మేరకు పాక్ ప్రధాని కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
"ఆపద్ధర్మ ప్రధానిగా చిన్న ప్రావిన్స్‌కు చెందిన నేత ఉండాలని మేం నిర్ణయించాం. ఈ క్రమంలోనే బలూచిస్థాన్‌కు చెందిన కాకర్ పేరును మా పార్టీ ప్రతిపాదించింది. షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు" అని ప్రతిపక్ష నేత రియాజ్ తెలిపారు. ఆగస్టు 13న(ఆదివారం) కాకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది.
ఎవరీ కాకర్?
బలూచిస్థాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్-ఉల్-హక్ కాకర్ ఓ చిన్న ప్రావిన్స్‌కు చెందిన స్థానిక రాజకీయ నేత. దేశమంతా పెద్దగా పరిచయం లేని వ్యక్తి. కానీ, తిరుగుబాట్లతో బలూచిస్థాన్ ప్రాంతం నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. కాకర్.. గతంలో బలూచిస్థాన్ ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బలూచిస్థాన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై సెనెట్‌లో సభ్యుడిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత బలూచిస్థాన్ అవామీ పార్టీలో చేరి సెనెట్‌లో పార్లమెంటరీ లీడర్‌గా నియమితులయ్యారు. విదేశాల్లో ఉండే పాకిస్థానీల సంరక్షణ, మానవ వనరుల అభివృద్ధిపై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్ కమిటీకి గతంలో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు.
ఆగస్టు 9న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రద్దు చేశారు. దీంతో 90 రోజుల్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇవి ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల జనాభా లెక్కల ప్రకారం.. గత ఆరేళ్లలో దేశ జనాభా 16 శాతం (20 కోట్ల నుంచి 24కోట్లకు) పెరిగింది. దానికనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించాలి. అప్పుడే ఎన్నికలు జరపాలని అక్కడి చట్టాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం నాలుగు నెలలు పడుతుందని పాక్ ఎన్నికల సంఘం చెబుతోంది.
Imran Khan Disqualification : ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐదేళ్లపాటు అనర్హత వేటు
Pakistan National Assembly Dissolved : పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు.. ఇప్పట్లో ఎన్నికలు జరుగుతాయా?