పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 60 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఆదివారం వివాహ వేడుకను ముగించుకుని ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు వెళ్తున్న బస్సు.. లాహోర్‌కు 240 కిలోమీటర్ల దూరంలోని కల్లార్ కహర్ సాల్ట్ రేంజ్ ప్రాంతంలో బోల్తా కొట్టింది. అయితే ఈ ఘటనకు ముందు ఎదురుగా వస్తున్న మూడు వాహనాలను బస్సు ఢీకొట్టింది. ఎమర్జెన్సీ సర్వీస్ బ్రేక్ ఫెయిల్యూర్ అవ్వటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బస్సులో నుంచి మృతులను, గాయపడిన వారికి వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని రావల్పిండి, ఇస్లామాబాద్ నగరాల్లోని ఆస్పత్రులకు తరలించామని ఆయన చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈనెల ప్రారంభంలోనూ పాకిస్థాన్‌లో ఇదే తరహాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 7న అతి వేగంగా వస్తున్న ఓ బస్సు... కారును బలంగా ఢీకొట్టగా 30 మంది మృతి చెందారు. మరెంతో మంది గాయపడ్డారు. గిల్గిత్ బాల్టిస్థాన్‌లోని దయామిర్ జిల్లాలో జరిగిందీ ప్రమాదం. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టారు. నాటి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను పాకిస్థాన్ ప్రధాని ఆదేశించారు.