North Korea vs South Korea Kim Jong Un : దక్షిణ కొరియాతో సంప్రదింపులు జరిపే కీలక ప్రభుత్వ ఏజెన్సీలను ఉత్తర కొరియా రద్దు చేసింది. పార్లమెంట్ సమావేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. "రెండు కొరియాలు ఇప్పుడు తీవ్రంగా ఘర్షణ పడుతున్నాయి. ఈ సమయంలో దక్షిణ కొరియాను దౌత్యపరమైన భాగస్వామిగా పరిగణించడం పెద్ద తప్పు అవుతుంది" అని ఉత్తర కొరియా పార్లమెంట్ తన ప్రకటనలో పేర్కొంది. శాంతియుత దేశ పునరేకీకరణ కమిటీ, నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, ఇంటర్నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్లను రద్దు చేయడం సహా చర్చలు, సహకారం, సంప్రదింపులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఉత్తర కొరియా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
'సయోధ్య కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయం'
పార్లమెంట్లో ప్రసంగిస్తూ దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణ కొరియాతో సయోధ్య కోసం ఇకపై ఎలాంటి ప్రయత్నాలు చేయబోనని కిమ్ తేల్చి చెప్పారు. దక్షిణ కొరియాను దేశపు నంబర్ 1 శత్రువుగా గుర్తించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు. వచ్చే సమావేశంలో రాజ్యాంగాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు.
శాంతియుత జాతీయ ఏకీకరణ కమిటీ ఇరుదేశాల వ్యవహారాలను చూసుకుంటుంది. 1961లో ఉభయ కొరియా దేశాలు ఏర్పడినప్పటి నుంచి ఈ కమిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. నేషనల్ ఎకనామిక్ కోఆపరేషన్ బ్యూరో, టూరిజం అడ్మినిస్ట్రేషన్ విభాగాలు ఉభయ దేశాల టూరిజం ప్రాజెక్టులను పర్యవేక్షిస్తాయి. అయితే, రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి.
ఇటీవల కాలంలో కిమ్ ఉపగ్రహాలు, ఆయుధాల ప్రయోగాలు ఉద్ధృతం చేశారు. అమెరికా, దక్షిణ కొరియాలకు తరచుగా హెచ్చరికలు పంపుతున్నారు. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కిమ్‌కు హెచ్చరికగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. ఈ విన్యాసాలపైనా కిమ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఏడాది అమెరికా, దక్షిణ కొరియాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశాలపై కిమ్ మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న కిమ్- ఆయన్ను చూసి ఏడ్చిన ప్రజలు- వీడియో వైరల్
కొరియాలోకి అమెరికా 'అణు' సబ్‌మెరైన్.. మిసైల్స్ ప్రయోగించి కిమ్ హెచ్చరిక