అమెరికా కుయుక్తులను ఎదుర్కోవాలంటే తమ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండాల్సిందేనని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ స్పష్టం చేశారు. దేశ భద్రతతో ముడిపడిన అణ్వాయుధ శక్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసి, దేశాన్ని బలహీన పరిచేందుకు దక్షిణ కొరియాతో కలిసి అమెరికా నిరంతరంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే తక్షణమే అణ్వాయుధాలతో స్పందించేలా సైన్యానికి అధికారం కల్పించే చట్టాన్ని సభ ఆమోదించింది. ఆంక్షల ఎత్తివేత వంటి తాత్కాలిక ఉపశమనాల కోసం అణ్వాయుధాలను వీడబోమని కిమ్ జోంగ్ నొక్కి చెప్పారు. తమ దేశంపై ఆంక్షలను వందేళ్ల పాటు కొనసాగించినా ఈ వైఖరిలో మార్పు ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాలను ఉత్తరకొరియా అధికారిక మీడియా వెల్లడించింది.
ఇవీ చదవండి: 'స్వదేశానికి వెళ్లిపో..!' భారతీయ-అమెరికన్ చట్టసభ్యురాలికి బెదిరింపులు!!