Nigeria Road Accident : నైజీరియా ఉత్తర ప్రాంతంలోని నైజర్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 200 మందితో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు రహదారిపై బోల్తాపడింది. ఈ ఘటనలో 25 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల ప్రధాన కారణం ట్రక్కు ఓవర్‌లోడే అని తెలుస్తోంది. ట్రక్కులో ప్రయాణికులు సహా భారీగా సామగ్రి ఉన్నట్లు సమాచారం.
ఇదీ జరిగింది..
మంగళవారం ఆహార పదార్థాలతో పాటు 200 మంది కూలీలతో ఓ ట్రక్కు నైజీరియాలోని ఎకనామిక్ హబ్ లాగోస్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో మగామా జిల్లాలోని తకలాఫియా గ్రామానికి చేరుకోగానే ట్రక్కు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది.
"మగామా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరుకుంది. మృతదేహాలను మార్చురీకి తరలించాం. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతుంది. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నాం. నైజర్ రాష్ట్రంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించేవారికి కఠినమైన జరిమానాలను విధిస్తాం."
- మహమ్మద్ ఉమారు బాగో, మగామా గవర్నర్
'రహదారులు బాగాలేకే..'
'ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్లు బాగా లేకపోవడం వల్ల పగటి పూట జరిగే ప్రమాదాలను తప్పించుకునేందుకు కొందరు ప్రయాణికులు రాత్రిళ్లు ఎక్కువగా ప్రయాణించడానికి మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతోనే ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడిందని అనుకుంటున్నాను. అయితే ట్రక్కులో ఉన్న వ్యక్తులు రహదారుల పరిస్థితి గురించి గానీ అందులో ఉన్న వస్తువుల గురించి గానీ పట్టించుకోలేదు' అని నైజీరియా ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ సెక్టార్ కమాండ్ కుమార్ త్సుక్వామ్ చెప్పారు.
అధ్యక్షుడి సంతాపం..
నైజీరియాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరగడానికి ముఖ్యమైన కారణాలు ఓవర్‌లోడ్, డ్రైవర్ల అజాగ్రత్తే కారణమని త్సుక్వామ్ అన్నారు. వీటితో పాటు ఇక్కడ ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు కూడా చాలా వరకు పాటించరని.. ఇందుకోసం విధించే జరిమానాల నుంచి కూడా చోదకులు తప్పించుకుంటున్నారని ఆయన వివిరించారు. ఇక ఈ దుర్ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండగ సీజన్ రానున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని ఆయన కోరారు.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధానికి 4 రోజుల బ్రేక్- ఆ తర్వాత తగ్గేదెెేలే!
ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం సక్సెస్- మూడో ప్రయత్నంలో ఎట్టకేలకు కక్ష్యలోకి ఎంట్రీ!