Nawaz Sharif Avenfield Case : పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు సార్వత్రిక ఎన్నికల ముందు భారీ ఊరట లభించింది. ఏవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించింది ఇస్లామాబాద్ హైకోర్టు. మరో అవినీతి కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. ఏవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో 2018లో తనకు విధించిన 10 ఏళ్ల జైలుశిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు షరీఫ్. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అమీర్ ఫారుఖ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అంతకుముందు 2018లో ఫ్లాగ్షిప్ అవినీతి కేసులో షరీఫ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది ట్రయల్ కోర్టు. దీనిని వ్యతిరేకించిన నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో, అవినీతి నిరోధక సంస్థ.. ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేశాయి. అయితే, తాజాగా తాము చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకున్నాయి. ఈ తీర్పుపై స్పందించిన నవాజ్ షరీఫ్.. సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసునంతా దేవుడికే వదిలేశానని.. ఆయనే చూసుకున్నారని చెప్పారు.
2019లో బెయిల్‌పై లండన్‌కు వెళ్లి.. ఇటీవలె పాక్‌కు
Nawaz Sharif Return to Pakistan : మూడుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధ్యక్షుడు షరీఫ్‌పై అనేక అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో న్యాయస్థానాలు ఆయనకు 2018లో శిక్ష విధించాయి. లండన్‌లో అక్రమ ఆస్తులు కూడబెట్టారన్న కేసులో పదేళ్లు, సౌదీ అరేబియాలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన కేసులో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఈ శిక్ష అనుభవిస్తుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం లాహోర్ హైకోర్టు నెల రోజులపాటు అనుమతి ఇవ్వగా... 2019, నవంబరులో షరీఫ్ లండన్ వెళ్లారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తొలిసారిగా స్వదేశీ గడ్డపై గత నెలలోనే అడుగుపెట్టారు. పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. షరీఫ్‌కు ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నారు. మరోవైపు 2024 జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.