త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఎండాకాలంలో అమెరికా పర్యటనకు రావాల్సిందిగా మోదీని బైడెన్ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఆహ్వానాన్ని మోదీ కూడా అంగీకరించినట్లు సంబంధిత వర్గాల పేర్కొన్నాయి. ఇరుదేశాల అధికారులు పరస్పరం మాట్లాడుకుని.. తేదీల విషయంలో కసరత్తు చేసున్నట్లు వెల్లడించాయి.
జీ-20కి ఈ సంవత్సరం భారత్ సారధిగా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించి సెప్టెంబర్లో పలు కీలక సమావేశాలు భారత్లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు బైడెన్ సహా మరికొంత మంది నేతలు భారత్కు వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే మోదీ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్, జులై నెలలో మోదీ అగ్రరాజ్య పర్యటన ఉండవచ్చని సమాచారం.
అయితే మోదీ అమెరికా పర్యటనకు కనీసం రెండు రోజులైనా కేటాయించవలసి ఉంటుంది. అమెరికా కాంగ్రెస్ను అద్దేశించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. బైడెన్ ఇచ్చే విందుకు సైతం హాజరు కావాచ్చు. ఈ సంవత్సరంలో భారత్లోని పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా భారత్లోనే జీ-20కి సంబంధించి సదస్సులు జరుగుతాయి. వీటన్నింటికీ మోదీ సారథ్యం వహించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆయనకు విదేశీ పర్యటలను ఉన్న నేపథ్యంలో.. మోదీ షెడ్యుల్ బిజీగా ఉండే అవకాశం ఉంది. కాగా మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ప్రధాని కార్యాలయం ఇంకా దృవీకరించలేదు.