Migrants Boat Capsized : వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగి ఏడుగురు చనిపోగా 56 మందికి పైగా గల్లంతయ్యారు. పశ్చిమ ఆఫ్రికా తీరానికి దాదాపు 620 కి.మీ దూరంలో ఉన్న కేప్ వర్డె దీవుల్లో జరిగిన ఈ ఘటనలో 38 మంది ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ విషయాన్ని యూఎన్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఫర్ ఆర్గనైజేషన్ సంస్థ తెలిపింది.
Migrants Boat Accident : జులై 10వ తేదీన సెనెగల్ నుంచి 100 మంది వలసదారులతో బయలుదేరిన పడవ మునిగిపోయినట్లు స్పెయిన్‌కు చెందిన ఓడ సిబ్బంది గుర్తించారు. అనంతరం కేప్ వర్డియన్ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ప్రమాదంలో గల్లంతైన వారంతా మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అయితే చేపలు పట్టే చిన్న పడవలో బయలుదేరిన వలసదారులు స్పెయిన్‌కు వెళ్తున్నట్లు సమాచారం. గల్లంతైన వారిలో తన ఇద్దరు మేనల్లుళ్లు కూడా ఉన్నారని స్థానిక మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు ఛైఖ్ అవ బోయె తెలిపారు.
పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు వెళ్లే మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదని అధికారులు తెలిపారు. కానీ గతేడాది కన్నా ఈసారి వలసదారుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. 2023 మొదటి ఆరు నెలల్లో సముద్రం ద్వారా స్పెయిన్ చేరుకోవడానికి ప్రయత్నించిన దాదాపు 1,000 మంది వలసదారులు మరణించారని వాకింగ్ బోర్డర్స్ గ్రూప్ తెలిపింది. నిరుద్యోగం, రాజకీయ అశాంతి వంటి అంశాలు వలస వెళ్లేందుకు ప్రజలను పురికొల్పుతున్నాయని చెప్పింది.
లిబియా ఘర్షణల్లో 45 మంది మృతి..
Libya Violence : మరోవైపు, లిబియా రాజధాని ట్రిపోలిలో వైరి వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 45 మంది చనిపోయారు. మరో 146 మంది వరకు గాయపడ్డారు. సాయుధ వర్గాలైన 444 బ్రిగేడ్‌కు, ప్రత్యేక ప్రతిఘటనా దళానికి మధ్య ఈ ఘర్షణలు జరుగుతున్నాయి. 444 బ్రిగేడ్‌కు చెందిన సీనియర్ కమాండర్ మహమ్మద్ హంజాను ప్రత్యర్థివర్గం సోమవారం ఉదయం నిర్బంధించిందన్న వార్తల నేపథ్యంలో ఈ ఘర్షణలు మొదలయ్యాయి.