Kiri Allan Latest News : ఆమె ఓ దేశ న్యాయశాఖ మంత్రి. అంటే ఆమె చేసే ప్రతి పని చట్ట ప్రకారమే ఉండాలి. కానీ ఆమె మద్యం తాగుతూ వాహనం నడపడమే కాకుండా ప్రమాదానికి కారణమయ్యారు. పోలీసులు అరెస్ట్ చేయబోగా ప్రతిఘటించడం కూడా వివాదాస్పదమైంది. ఆమె నిర్వాకం మీడియాలో రావడం వల్ల.. చివరికి తన పదవికి రాజీనామా చేశారు.
ఇదీ జరిగింది..
New Zealand Justice Minister : న్యూజిలాండ్ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్ ఆదివారం రాత్రి పూటుగా మద్యం తాగి వేగంగా వాహనాన్ని నడిపారు. వేగాన్ని నియంత్రించలేక పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరీక్షలు చేయగా ఆమె మద్యం సేవించినట్లు తేలింది. అనంతరం కిరి అలెన్‌ను పోలీసులు స్టేషన్‌లో నాలుగు గంటలపాటు ఉంచారు.
కిరి అలెన్ మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని మంత్రిగా విధులు నిర్వహించేందుకు తగినంత ఫిట్‌గా లేరని న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం సహించరానిదన్నారు. కిరి అలెన్ ఇటీవలే తన భర్త నుంచి విడిపోయారు. తన బృందంలోని ఉద్యోగులతో కూడా ఆమె ప్రవర్తన సరిగా ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. హిప్కిన్స్ మంత్రి వర్గంలో ఇప్పటికే నలుగురు మంత్రులు వివాదాల కారణంగా తమ పదవులను కోల్పోయారు. అక్టోబర్ 14 తేదీన న్యూజిలాండ్‌లో ఎన్నికలు ఉండటం వల్ల మంత్రుల వివాదాలు, రాజీనామాలు అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
సహోద్యోగితో అనుచిత సంబంధం.. మంత్రిపై వేటు..
ఇలాంటి ఘటనలు న్యూజిలాండ్‌లో ఇంతకుముందు జరిగాయి. తన సహోద్యోగితో అనుచిత సంబంధం కలిగి ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ మంత్రిపై 2020 జులైలో న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ వేటు వేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. మంత్రి ఇయాన్ లీస్ గాలోవే.. అతడి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళతో సంవత్సరం నుంచి సంబంధం కలిగి ఉన్నారని జసిండా పేర్కొన్నారు.
మంత్రి గాలోవే ఇదివరకు పర్యవేక్షించిన విభాగంలోనే సదరు మహిళ తొలుత ఉద్యోగం సంపాదించిందని, ఆ తర్వాత ఇప్పుడున్న ఆఫీస్‌లోకి మారిందని ప్రధాని ఆర్డెర్న్ తెలిపారు. మంత్రిపై నైతికాభిప్రాయానికి వచ్చేందుకు కాస్త జాగ్రత్తపడినట్లు ఆయన చెప్పారు. అయితే మంత్రి గాలోవే స్వయంగా ఆరోపణలపై స్పందించి.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారని వెల్లడించారు. అయితే వీరి మధ్య సంబంధం కొద్ది నెలల క్రితం ముగిసిపోయినట్లు ఆర్డెర్న్ పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని జసిండా నిర్ణయాన్ని మంత్రి లీస్ గాలోవే సమ్మతించారు. ఈ విషయంలో క్షమాపణలు కోరారు.
ఒకరోజు ముందు విపక్ష నేత రాజీనామా..
అయితే ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు విపక్ష నేత ఆండ్రూ ఫాలూన్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఓ యూనివర్సిటీ విద్యార్థి సహా కొంతమంది మహిళలకు అసభ్య చిత్రాలు పంపించారనే ఆరోపణల నేపథ్యంలో ఫాలూన్ రాజీనామా చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలపై ఫాలూన్ స్పష్టతనివ్వలేదు. కాగా తాను చేసిన తప్పులకు క్షమాపణ కోరారు. ప్రస్తుతం మానసిక చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి కథనం చదవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.