Japan earthquake Old woman rescued : జపాన్‌లో భూకంపం ధాటికి కూలిపోయిన ఓ ఇంటి శిథిలాల్లో చిక్కుకున్న 90 ఏళ్ల వృద్ధురాలిని సురక్షితంగా బయటకు తీశారు రెస్క్యూ సిబ్బంది. 5 రోజుల తర్వాత సజీవంగా రక్షించారు. అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో 72 గంటల తర్వాత మనుగడ అవకాశాలు తగ్గుతాయి. కానీ ఐదు రోజుల తర్వాత కూడా 90 ఏళ్ల వృద్ధురాలు సురక్షితంగా బయటపడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
భూకంపం తర్వాత జపాన్ సైనికులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు.
జపాన్‌కు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంతాపం
జపాన్‌లో సంభించిన భూకంపం పట్ల ఆ దేశ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంతాప సందేశం పంపించినట్లు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ శనివారం తెలిపింది. ఈ విషయాన్ని జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి ధ్రువీకరించారు. అంతకుముందు అమెరికా వంటి మిత్రదేశాలు కూడా సంతాప సందేశాలు పంపించాయని చెప్పారు. అయితే ఉత్తరికొరియా చివరిసారిగా 1995లో ఓ విపత్తు సమయంలో ఇలాంటి సందేశం పంపించినట్లు తెలిపారు.
మంచులో సహాయక చర్యలకు ఆటంకం
గత సోమవారం పశ్చిమ జపాన్‌లో 7.6 తీవ్రతో సంభవించిన భకంపం తర్వాత వచ్చిన ప్రకంపనలు రహదారులను బ్లాక్ చేశాయని, దీంతో సహాయక చర్యలకు సంబంధించి రవాణాకు ఇబ్బంది కలింగిందని అధికారులు తెలిపారు. ఆదివారం మంచు కురిసే అవకాశం ఉందని, దాని వల్ల పరిస్థితి మరింత ప్రమాదం పెరుగుతుందని చెప్పారు. అయితే భూకంపం వల్ల చిక్కుకుపోయిన మారుమూల గ్రామాలకు, మంచులోనూ నిత్యవసరాలను సరఫరా చేస్తున్నాయి సహాయక బృందాలు. ఇక విద్యుత్ సరఫరా లేక సెల్ఫోన్లను కూడా వినియోగించలేకపోతున్నామని బాధితులు వాపోతున్నారు.
ఈ భూకంపం వల్ల ఇషికావా ప్రాంతంలోని అనేక ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ విపత్తు వల్ల మొత్తంగా జపాన్‌లో ఇప్పటివరకు 126 మంది చనిపోయారు. 500మందికి పైగా గాయాలపాలయ్యారు. అందులో దాదాపు 30 మంది పరిస్థితి విషమంగా ఉందిని తెలుస్తోంది. 200మందికి పైగా ఆచూకీ ఇంకా తెలియలేదు. 30మందికి పైగా బాధితులను పాఠశాలలు, ఆడిటోరియాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తప్పిపోయిన తమ ఆత్మీయులు క్షేమంగా ఉండాలని వారు ప్రార్థిస్తున్నారు. వాజిమా ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల షిరో కొకుడా అనే వ్యక్తి ఇంకా తన స్నేహితుల ఆచూకీ కోసం సహాయక కేంద్రాల వద్ద వెతుకుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది.