సాంకేతిక పురోగతి కారణంగా చాలా ఉద్యోగాల్లో గంటల తరబడి కుర్చీకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. ఒకటిరెండుసార్లు టాయిలెట్‌కు వెళ్లడానికి నాలుగు అడుగులు వేయడం మినహా శిలాప్రతిమలా ఉండిపోయే సమయం నానాటికీ పెరుగుతోంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమైంది. 'వర్క్ ఫ్రమ్ హోమ్' వల్ల అనేకమంది ఇళ్లల్లో నుంచి బయటకు రావడానికీ ఇష్టపడటంలేదు. ఈ తరహా 'నిశ్చల జీవితం' క్రమంగా పెను సమస్య కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై పరిశోధన సాగించిన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తేలికపాటి పరిష్కార మార్గాన్ని చూపారు.
'తక్కువ సమయం కూర్చోవాలి. ఎక్కువసేపు కదులుతూ ఉండాలి'
ప్రస్తుతం వైద్య నిపుణులు ఇచ్చే సూచన ఇది. అయితే ఎంత తరచూ మనం కదులుతూ ఉండాలి.. ఎంతసేపు నడుస్తుండాలి.. అనే అంశాలపై స్పష్టత లేదు. కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. ఆరోగ్యవంతులైన వాలంటీర్లను ల్యాబ్‌లో 8 గంటల పాటు కూర్చోబెట్టారు. సాధారణంగా ప్రామాణిక పనిదినాన ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొనే సమయం ఇదే.
వెల్లడైన అంశాలివీ..
ఈ పరిశోధన ఐదు రోజుల పాటు సాగింది. అందులో ఒక రోజు.. వాలంటీర్లు కొద్దిసేపు టాయిలెట్‌కు వెళ్లడం మినహా 8 గంటల పాటు కుర్చీకే అతుక్కుపోయారు. మిగతా రోజుల్లో శాస్త్రవేత్తలు భిన్న వ్యూహాలు అమలు చేశారు. ఒకరోజు వాలంటీర్లను ప్రతి అరగంటకు ఒక నిమిషం పాటు నడిపించారు. మరో రోజు.. గంటకు ఐదు నిమిషాల చొప్పున ఆ నడక సాగింది. మొత్తం మీద.. సుదీర్ఘ సమయం పాటు కూర్చుండిపోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఎంత తక్కువ నడకతో తగ్గించవచ్చన్నది పరిశీలించారు. ఈ క్రమంలో వారు గుండె జబ్బులకు సంబంధించిన రెండు ముప్పు అంశాలైన రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటును పరిశీలించారు.
- అరగంటకోసారి ఐదు నిమిషాల పాటు తేలికపాటి నడక సాగించడమే అత్యుత్తమమని వెల్లడైంది. రోజంతా కూర్చోవడంతో పోలిస్తే ఈ విధానం వల్ల రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా తగ్గుతోంది. రక్తపోటు కూడా 4-5 పాయింట్ల మేర మెరుగైంది.
- ఈ విధానం మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించింది. అలసట భావనను తగ్గించింది. పునరుత్తేజాన్ని నింపింది. మంచి మనఃస్థితిలోకి తీసుకెళ్లింది. కనీసం గంటకోసారి లేచి నడక సాగించినా ఈ మానసిక ప్రయోజనాలను పొందొచ్చు.
- కుర్చీకి తరచూ విశ్రాంతి ఇవ్వడం వల్ల ఉద్యోగి ఉత్పాదకత కూడా మెరుగుపడుతుంది.
ఎందుకంత ముఖ్యం?
- గంటలతరబడి కుర్చీకే పరిమితమయ్యేవారికి మిగతావారితో పోలిస్తే మధుమేహం, గుండె జబ్బు, తీవ్ర మతిమరుపు, కొన్ని రకాల క్యాన్సర్లకు, అకాల మరణానికి ఆస్కారం ఎక్కువ.
- గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల రక్త ప్రవాహం సాఫీగా సాగదు. ఇది శరీరంలో ప్రతి వ్యవస్థపైనా ప్రభావం చూపుతుంది.
- ఇలాంటివారు నిత్యం వ్యాయామం చేసినా.. ఈ దుష్ప్రభావాలు తొలగకపోవచ్చు. మధ్యమధ్యలో కుర్చీలో నుంచి లేచి నడక సాగించడమే ఉత్తమం.
- ఎక్కువసేపు నిలబడటం, నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. సాధారణ నొప్పులు తగ్గుతాయి. రక్తప్రవాహం మెరుగుపడి మెదడుకు ఆక్సిజన్, పోషకాలు బాగా అందుతాయి.
- శారీరక కదలికల సమయంలో.. కొవ్వును కరిగించే ఎంజైమ్‌లు చురుగ్గా ఉంటాయి.
- క్రమం తప్పకుండా అడుగులు వేయడం వల్ల సహజసిద్ధ యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తి మెరుగుపడుతుంది. క్యాన్సర్ ముప్పును పెంచే ఫ్రీ రాడికల్స్‌ను అవి చంపేస్తాయి.