Israel Hamas War : గాజాలో భీకరంగా పోరాటం జరుగుతున్న వేళ.. ఉగ్రసంస్థ హమాస్ ఓ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌తో సంధికి చేరువవుతున్నట్లు హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో పోస్ట్ కూడా చేశారు. హమాస్, ఇజ్రాయెల్ రక్షణదళం-IDFకు మధ్య జరుగుతున్న పోరాటంలో సామాన్య ప్రజలే ఎక్కువగా బలైపోతున్న నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఖతార్ మధ్యవర్తిత్వంలో ఈజిప్టు, కొన్ని అరబ్ దేశాలు, అమెరికా కొద్దిరోజులుగా సంధి కుదిర్చేందుకు ఇరుపక్షాలతో చర్చలు జరుపుతున్నాయి. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రసంస్థ అపహరించిన బందీలను విడుదల చేసే వరకూ దాడులు ఆపబోమని.. ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలో సంధి ప్రయత్నాలు తుదిదశకు చేరుకుంటున్నట్లు సోమవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ వెల్లడించారు. తాజాగా హమాస్ సంస్థ అధిపతి ఇస్మాయిల్ హనియా కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఇరు వర్గాల మధ్య ఒప్పందం..!
Israel Hamas War Ceasefire : విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం 5 రోజుల పాటు సంధికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఈ ఐదు రోజులు క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ, దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు తగ్గించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రతిగా 50 నుంచి 100 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. విడుదల చేసే బందీల్లో సామాన్య పౌరులు, విదేశీయులు ఉంటారు. బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేయబోమని హమాస్ చెప్పినట్లు తెలిసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 300 మంది పాలస్తీనా వాసులను విడుదల చేయాలని హమాస్ ప్రతిపాదించినట్లు సమాచారం. 300 మందిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు గాజాలో బాధితులకు మానవతా సాయం అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. రెడ్ క్రాస్ అంతర్జాతీయ ప్రతినిధి ఖతార్ వెళ్లి ఈ అంశంపై హమాస్ అధినేత హనియాతో చర్చించనున్నారు. బాధితులను రక్షించడమే అన్నిటికంటే అధిక ప్రాధాన్యం కావాలని ఇరుపక్షాలకు రెడ్‌క్రాస్ విజ్ఞప్తి చేసింది.
'దక్షిణ గాజా నుంచి పారిపోండి'- పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు
హమాస్‌పై ఇజ్రాయెల్ ఉక్కుపాదం- కీలక నేత ఇల్లు ధ్వంసం, నేవీ ఆయుధాలు సైతం!