Israel Hamas War Latest : గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం భూతల దాడులకు సిద్ధమవుతున్న వేళ.. 10 లక్షల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. గాజా నగరం ఉన్న ఉత్తర గాజా స్ట్రిప్‌ను ఖాళీ చేయాలని ఇప్పటికే ఇజ్రాయెల్ పలు మార్లు హెచ్చరికలు చేసింది. గాజా స్ట్రిప్ మొత్తం జనాభా 23 లక్షలుకాగా ఉత్తర గాజాలో 11 లక్షల మంది ఉంటారు. ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర గాజాలో 10 లక్షల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి దక్షిణ గాజాకు తరలిపోయారు.
Israel Hamas War Update : గత వారం రోజులుగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్నా గాజా నుంచి ఇజ్రాయెల్‌వైపు దూసుకొస్తున్న రాకెట్ దాడులను మాత్రం ఆపలేకపోయింది. ఈ నేపథ్యంలో భూతల దాడి మాత్రమే సరైనదని ఇజ్రాయెల్ భావిస్తోంది. గాజా- ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఐదు యుద్ధాల్లో ఇదే అత్యంత తీవ్రమైనది. ఇప్పటికే ఇరువైపులా 4 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 10 వేల మందికిపైగా గాయపడ్డారు. హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ల వద్ద 199 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అందులో విదేశీయులు ఎంతమంది ఉన్నారనే వివరాలు తెలియలేదు. ఏ గ్రూపు ఎంత మందిని బందీలుగా ఉంచిందనే విషయాన్ని సైతం ఇజ్రాయెల్ సైన్యం స్పష్టంగా వెల్లడించలేదు.
'కాల్పుల విరమణ లేదు'
Israel Hamas Conflict 2023 : గాజాపై ఇజ్రాయెల్ భూతలదాడికి దిగితే అది అతిపెద్ద మానవతా సంక్షోభానికి దారి తీస్తుందని సహాయక బృందాలు హెచ్చరిస్తున్నాయి. గాజా సరిహద్దుల్లో లక్షలాది మంది ఇజ్రాయెల్ సైనికులు ఇప్పటికే మోహరించారు. వారికి మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి. హమాస్ మిలిటెంట్ల ఏరివేత విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. పది రోజులుగా హమాస్ మిలిటెంట్లపై విరుచుకుపడుతోంది. ఈ విషయంలో వెనకడుగు వేసేదే లేదని ఆ దేశ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. హమాస్‌కు, ఇజ్రాయెల్ సేనలకు మధ్య కాల్పుల విరమణ లేదని స్పష్టం చేశారు.
లీటరు నీటితోనే రోజంతా.. ఒక్కరోజుకే ఇంధన నిల్వలు
గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ అష్టదిగ్బంధనం చేయడం వల్ల ఆహారం, నీటి కొరత నెలకొంది. కొన్ని రోజులుగా విద్యుత్ లేక గాజా ప్రజలు చిమ్మచీకట్లలో ఉంటున్నారు. ఐరాస సహాయ శిబిరాల్లో 4 లక్షల మందికిపైగా తలదాచుకుంటున్నారు. అనేక మంది రోజుకు ఒక్క లీటరు నీటితోనే కాలం గడుపుతున్నారు. ఔషధాల కొరత కారణంగా గాజాలో వేలాదిగా రోగుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇంధన కొరతతో గాజా ఆస్పత్రుల్లో విద్యుత్ నిలిచిపోతే ప్రమాదం కూడా ఉంది. ఆస్పత్రుల్లో ఒక్కరోజుకు మాత్రమే సరిపోయేంత ఇంధనం ఉందని తెలుస్తోంది. గాజా నుంచి ఈజిప్టుకు వెళ్లేందుకు రఫా సరిహద్దు వద్ద వందలాదిగా ప్రజలు వేచి ఉన్నారు. గాయపడ్డ వారు, అనారోగ్యంతో ఉన్న వారు, విదేశీయులు ఈ మార్గం గుండా ఈజిప్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా గాజాలో ఉన్న వారికి సహాయక సామగ్రి అందే అవకాశం ఉంది.
శిథిలాల దిబ్బగా గాజా
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలో జరిగిన విధ్వంసానికి సంబంధించి అల్ జజీరా వార్తా సంస్థ విడుదల చేసిన వీడియో గాజా పట్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఎటు చూసినా నేటమట్టమయిన భవనాలు, శిథిలాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఈనెల 7 నుంచి మొదలైన ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజాలోని అనేక భవనాలు నేలకూలాయి. ఫలితంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 5 లక్షల మంది ఐరాసకు చెందిన పాఠశాలలతో పాటు ఇతర శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. శిబిరాలు కూడా సామర్థ్యానికి మించి నడుస్తున్నాయని ఐరాస అధికార ప్రతినిధి తెలిపారు. ఈజిప్టు, ఇజ్రాయెల్ వైపునున్న సరిహద్దులను మూసివేయడం వల్ల శరణార్థులు కనీస అవసరాలకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, నీరు విషయంలో సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఆహారం, మందుల కొరత
ఇజ్రాయెల్ వైమానిక దాడులతో వారం రోజుల్లో గాజాలో దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయినట్లు తెలుస్తోంది. ఈజిప్టు, ఇజ్రాయెల్ వైపునున్న సరిహద్దులను మూసివేయడం వల్ల పాలస్తీనియన్లు పక్కనున్న దేశాలకు తరలివెళ్లలేక పోతున్నారు. ఐరాస, రెడ్‌క్రాస్ వంటి అంతర్జాతీయ సంస్థలు సాయం చేయడానికి ముందుకొస్తున్నా ఆహారం, మందుల సరఫరాలు లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. శరణార్థుల్లో పిల్లలు, వృద్ధులు ఉన్నందున పరిస్థితి దయనీయంగా మారిందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. వారి అవసరాలను ఎలా తీర్చాలో తమకు అర్థం కావడం లేదని వాపోతున్నారు. మరోవైపు హమాస్‌ను నామరూపాల్లేకుండా చేసేంత వరకు వెనక్కి తగ్గబోమని ఇజ్రాయెల్ తేల్చిచెప్పగా.. గాజా పట్టీ మానవత సంక్షోభంలోకి జారుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తక్షణం ఈ యుద్ధానికి ముగింపు పలకాలని సూచిస్తున్నారు.
Hamas Secret Weapon : 'రహస్య ఆయుధం'తో హమాస్ దొంగదెబ్బ!.. ఇజ్రాయెల్‌ను ఢీకొట్టేందుకు భారీ స్కెచ్!