Israel Hamas War : గాజాపై విరుచుకుపడుతూ హమాస్ తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న ఇజ్రాయెల్.. కీలక ప్రాంతాలపై పట్టు సాధించింది. గడిచిన 24 గంటల్లో 30 మంది మిలిటెంట్లను హతమార్చామని, 41 మందిని అదుపులోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) తెలిపింది. హమాస్ కీలక నేత యాహ్యా సిన్వార్ సోదరుడు మహమ్మద్ సిన్వార్ కార్యాలయంపై దాడి చేసినట్లు ఇజ్రాయెలీ దళాలు తెలిపాయి.
150 మంది హతం
Israel Ground Invasion : తమ సైన్యానికి చెందిన 401వ బ్రిగేడ్ దాడుల్లో.. 150 మంది ఉగ్రవాదులను హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అందులో కీలక కమాండర్లు సైతం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర గాజాలోని హమాస్ ఉగ్రవాదుల ఆయుధ కర్మాగారాలు, లాంచింగ్ స్టేషన్లు, అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌లను తన అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. అదేసమయంలో లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు చేసిన దాడులకు దీటుగా బదులిచ్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. 24 గంటల నుంచి రాకెట్లు ప్రయోగిస్తున్న హెజ్బొల్లా ముష్కరులపై తమ వాయుసేన దాడులు చేసిందని వెల్లడించింది. మిలిటరీ స్థావరాలు, ఆయుధ డిపోల లక్ష్యంగా దాడులు సాగినట్లు చెప్పింది.
Israel Attack On Gaza Today : ఉత్తర గాజాలోని కీలక ఆస్పత్రులను ఇజ్రాయెలీ యుద్ధ ట్యాంకులు చుట్టుముట్టాయి. ప్రధాన ఆస్పత్రి అల్-ఫిషాలోనూ దిగ్బంధించాయి. ఇక్కడే హమాస్ ప్రధాన కమాండ్ కార్యాలయం ఉందని ఇజ్రాయెల్ పదే పదే చెబుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి వేలాది మంది పాలస్తీనియన్లు ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఒక్క అల్-ఫిషాలోనే దాదాపు 80 వేల మంది తలదాచుకున్నారు. గురువారం రాత్రి నుంచి ఆసుపత్రుల సమీపంలోని భవనాలపై ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేస్తుండటం వల్ల చాలా మంది ప్రాణభయంతో దక్షిణ గాజావైపు తరలివెళుతున్నారు. వీరు సురక్షితంగా వెళ్లేందుకు వీలుగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా దాడులు నిలిపివేసినట్లు సమాచారం.
హమాస్ రాకెట్ల ప్రయోగం..
మరోవైపు టెలీ అవీవ్‌పై హమాస్ శుక్రవారం రాకెట్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒక ఇజ్రాయెలీ పౌరుడు గాయపడ్డాడు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 11,078 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.
యుద్ధానికి 4 గంటల విరామం- అమెరికా ప్రకటన, ఖండించిన ఇజ్రాయెల్- హమాస్‌కు భారత్ సందేశం
గాజా ఆస్పత్రుల్లో రోగుల ఆర్తనాదాలు, 50వేల మందికి నాలుగే టాయిలెట్లు- 130 సొరంగాలు ధ్వంసం