ఇండోనేసియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించి 16 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం జరిగిందీ ఘటన. 180 మంది అగ్నిమాపక సిబ్బంది, 37 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు పయత్నిస్తున్నారు.
ఉత్తర జకార్తాలోని తనహ్ మేరా పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆయిల్ డిపోలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇండోనేసియా ఇంధన అవసరాల్లో 25 శాతం మేర ఈ డిపో నుంచి సరఫరా చేస్తుంది. శుక్రవారం భారీ వర్షంతో పాటుగా పిడుగుల కారణంగా ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తర్వాత ఇది అనేక పేలుళ్లకు కారణమైంది. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల.. అగ్నిమాపక అధికారులు నివాస ప్రాంతాల్లో ఉండే వేలాది మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదం వల్ల దేశ ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదని అధికారులు వెల్లడించారు.