Indian Consulate Attacked In US : భారత్‌కు వ్యతిరేకంగా ఖలిస్థాన్వాదులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఇండియన్ కాన్స్లెట్లో విధ్వంసం సృష్టించారు. కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. జులై 2న ఈ ఘటన జరిగింది. ఇండియన్ కాన్సులేట్‌లో మంటలు చెలరేగుతున్న దృశ్యాన్ని ఖలిస్థానీలు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హింసను హింస ప్రేరేపిస్తుంది అనే పదాలు ఈ వీడియో కనిపిస్తున్నాయి. కెనడాకు చెందిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ మరణ కథనం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.
ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. శనివారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై జరిగిన విధ్వంసం, దానికి నిప్పు పెట్టే ప్రయత్నాన్ని ఖండిస్తూ.. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. అమెరికాలోని విదేశీ రాయబార కార్యాలయాలపై దాడులను నేరపూర్వక చర్యగా ఆయన అభివర్ణించారు.
శనివారం అర్ధరాత్రి దాటాక 1:30- 2:30 గంటల సమయంలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌లో మంటలు చెలరేగాయని అమెరికా మీడియా వెల్లడించింది. దీనిపై వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అనంతరం మంటలను ఆర్పేసినట్లు పేర్కొంది. ఘటనలో స్పల్ప నష్టం జరిగిందని, ఎవ్వరూ గాయపడలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. అదే విధంగా జులై 8న 'ఖలిస్థాన్ ఫ్రీడమ్ ర్యాలి' నిర్వహిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అమెరికాలోని బెర్క్లే, కాలిఫోర్నియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ వరకు ఈ ర్యాలీ సాగనున్నట్లు అందులో ఉంది.
లండన్‌లో జాతీయ జెండాకు అవమానం.. బ్రిటన్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..
indian high commission london khalistan : 2023 మార్చి నెలలోనూ ఖలిస్థాన్ అనుకూల వాదులు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండాను.. కిందికి దింపేసి అగౌరవపరచారు. అనంతరం ఘటనకకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. అనంతరం దిల్లీలోని బ్రిటన్ సీనియర్ దౌత్యవేత్తకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఖలిస్థాన్ వేర్పాటు వాదులు.. లండన్‌లో చేసిన ఈ పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. నిరసనకారులు భారత హైకమిషన్ కార్యాలయానికి వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని.. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.