India China military drills: భారత్, చైనా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు డ్రాగన్ పేర్కొంది. రష్యాలో ఈ నెల చివర్లో జరగనున్న వొస్తోక్-2022 విన్యాసాల్లో భారత్ సైతం పాల్గొననుందని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా, చైనా సైన్యాల మధ్య ఉన్న సహకారంలో భాగంగా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) బలగాలను రష్యాకు పంపించనున్నట్లు డ్రాగన్ తన ప్రకటనలో పేర్కొంది. భారత్ సహా బెలారస్, తజికిస్థాన్, మంగోలియా తదితర దేశాలు సైతం ఈ డ్రిల్స్‌లో పాల్గొంటాయని వెల్లడించింది. ఈ విన్యాసాలకు.. ప్రస్తుత అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదని చైనా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం, వాస్తవాధీన రేఖ ప్రతిష్టంభనను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
అయితే, చైనా ప్రకటనపై భారత్ స్పందించలేదు. రష్యాలో విన్యాసాల విషయంపై భారత సైన్యం కానీ, రక్షణ శాఖ కానీ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. గతేడాది రష్యాలో జరిగిన విన్యాసాలకు భారత్ హాజరైంది. చైనా, పాకిస్థాన్ సహా 17 దేశాలు ఆ డ్రిల్స్‌లో భాగమయ్యాయి. రష్యా వార్తా సంస్థల ప్రకారం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు వొస్తోక్-2022 విన్యాసాలు జరగనున్నాయి. రష్యా తూర్పు ప్రాంతంలో బలగాలు విన్యాసాలు నిర్వహిస్తాయని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.