హార్లీ డేవిడ్సన్ బైక్ ఒకటి వేలంలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయింది. 1908 సంవత్సరంలో తయారు చేసిన ఈ బైక్.. రూ. 7,71,56,200 (9,35,000 అమెరికా డాలర్లు) ధర పలికి రికార్డు సృష్టించింది. స్ర్టాప్ ట్యాంక్ హార్లీ డేవిడ్సన్ అనే పేరు గల ఈ బైక్‌ను.. జనవరిలో వేలానికి ఉంచారు. పాత కాలపు మోటార్ బైక్‌లు అమ్మే వింటజంట్ వెబ్సైట్లో ఈ బైక్‌కు వేలానికి పెట్టారు. ఈ వెబ్సైట్లోనే బైక్ భారీ ధరకు అమ్ముడైనట్లు అమెరికా వార్తా పత్రిక ది మిల్వాకీ జర్నల్ సెంటినెల్ శుక్రవారం వెల్లడించింది.
ఈ బైక్‌కు స్ట్రాప్ ట్యాంక్ అని పేరు పెట్టడానికి గల కారణం.. బైక్ ఆయిల్, ఇంధన ట్యాంక్‌ను నికెల్‌తో చేసిన పట్టీలతో జతచేయడమే. ప్రపంచంలోని అరుదైన 12 మోడళ్లలో ఇది ఒకటి. కాగా 1907 సంవత్సరంలో తయారు చేసిన స్ట్రాప్ ట్యాంక్ హార్లీ డేవిడ్సన్ బైక్ రూ. 5,90,01,800 (7,15,000) డాలర్లు పలికింది.
"మేము బైక్ వేలానికి బాగా ప్రచారం కల్పించాం. హార్లీ డేవిడ్సన్.. అమెరికన్ మోటార్ సైకిల్ బ్రాండ్‌లో అత్యంత ప్రసిద్ధమైనది. కాబట్టి ఇది మంచి ధరకే అమ్ముడవుతుందని భావించాం. ఇది మా అంచనాలకు మించిన ధరకు అమ్ముడుపోయింది. రికార్డు ధరను సొంతం చేసుకున్నఈ బైక్‌లో పూర్తి ఒరిజినల్ భాగాలు ఉన్నాయి. చాలా అరుదైన వస్తువులతో ఈ బైక్‌ను తయారు చేశారు."
--గ్రెగ్ ఆర్నాల్డ్, హార్లి డేవిడ్సన్ కంపెనీ డివిజన్ మేనేజర్