Hamas Tunnel Network Gaza : హమాస్‌ను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఆ ముఠా స్థావరాలను ఒక్కొక్కటిగా కనిపెడుతోంది. తాజాగా గాజా సిటీలో హమాస్ అగ్రనేతలైన యహ్యా సిన్వార్, ఇస్మాయిల్ హనియే వినియోగించిన ఓ భారీ టన్నెల్ నెట్‌వర్క్ సెంటర్‌ను ఛేదించినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ -IDF తెలిపింది. ఇక్కడి నుంచే హమాస్ తమ సొరంగ నెట్‌వర్క్‌ను నిర్వహించినట్టు పేర్కొంది.
టన్నెల్ లోపల చిత్రాలను విడుదల చేసిన ఇజ్రాయెల్ సైనికులు వాటిని ఒక్కొక్కటిగా వివరిస్తూ ముందుకు కదిలారు. భూగర్భంలో 60 అడుగుల కింద గదులున్నాయని అక్కడకు చేరుకునేందుకు ఎలివేటర్లు ఉన్నాయని తెలిపారు. హమాస్ తమ నెట్‌వర్క్ కార్యకలాపాల కోసం లోపల విద్యుత్‌ను కూడా ఏర్పాటు చేసుకుందని వివరించారు. హమాస్ కీలక నేతల కోసం విశాలమైన సమావేశాల గదులు, ప్రార్థనా స్థలాలు ఉన్నాయనీ వీటితో పాటు ఆహారం, నీరు, ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు హమాస్ ఏర్పాటు చేసుకుందని చెప్పారు. లోపల మరిన్ని సొరంగాలు, కాంక్రీట్ గోడలు, బ్లాస్ట్ డోర్లు, వెంటిలేషన్ సిస్టమ్‌లు, సెక్యూరిటీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలున్నాయని తెలిపారు.
మరోవైపు బందీల విడుదల కోసం మరో ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రతిపాదించగా హమాస్ దాన్ని తిరస్కరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. హమాస్ చెరలో ఉన్న మరో 40 మంది విడుదల కోసం 7 రోజుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గాజా పట్టీలో ఇజ్రాయెల్ తమ దాడులను పూర్తిగా నిలిపివేస్తేనే సంధిపై తాము చర్చిస్తామని మధ్యవర్తిగా ఉన్న ఈజిప్టు ప్రతినిధులకు హమాస్ చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది. అక్టోబరు 7 నాటి హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 20వేల మంది తమ పౌరులు మరణించినట్లు గాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్‌కు చెందిన 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు IDF ప్రకటించింది.
'పశ్చిమ దేశాలు సూచిస్తున్న ఫార్ములాను అంగీకరించబోం'
కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య సమస్య శాశ్వత పరిష్కారానికి పశ్చిమ దేశాలు సూచిస్తున్న రెండు దేశాల ఫార్ములాను తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ను దేశంగానే పరిగణించరన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని పేర్కొంది. ఈ పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
బందీల విడుదలకు హమాస్ నో- ఒత్తిళ్లకు తగ్గేదేలేదన్న ఇజ్రాయెల్
సొంత బందీలను చంపిన ఇజ్రాయెల్- శత్రువులుగా పొరపాటుపడ్డామన్న సైన్యం