H1B Visa Stamping: హెచ్-1 బీ వీసాదారులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి అమెరికాలో హెచ్-1 బీ వీసాలకు స్టాంపింగ్ చేసుకునే అవకాశం రానుంది. అందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆసియా అమెరికన్ల, పసిఫిక్ ద్వీపవాసులు ఉన్న ఆ దేశ అధ్యక్ష కమిషన్ ఆమోదించింది. అయితే ఈ సిఫార్సును అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదిస్తే ఎంతో మంది విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయులకు ఉపశమనం లభించనుంది.
బుధవారం వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్ష కమిషన్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఎక్కువ మంది భారతీయులు.. హెచ్ 1బీ వీసాల పునురుద్ధరణ కోసం వేచి చూస్తుండడం వల్ల కమిషన్ సభ్యుడు భారతీయ అమెరికన్ అజయ్ జైన్ భూటోరియా ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు.
"స్టాంపింగ్ ప్రక్రియలో భాగంగా హెచ్-1 బీ వీసాదారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీసాలు రెన్యువల్ జరగక అనేక మంది తమ కుటుంబాలతో దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు అనారోగ్యం పాలై ఐసీయూలో ఉన్నా.. తమ ఇంటికి వెళ్లలేకపోతున్నారు. మరికొందరు భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ పొందడానికి 844 రోజులు పడుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది."
-- అజయ్ జైన్ భూటోకరియా, కమిషన్ సభ్యుడు
ప్రతిపాదనలో ఏముందంటే?
హెచ్-1 బీ వీసాదారుల ప్రక్రియను పరిశీలించే యూఎస్సీఐఎస్ విధివిధానాల్లో మార్పులు చేపట్టాలి. చాలా ఏళ్ల క్రితం పొందుపరిచిన మార్గదర్శకాలను మరోమారు పరిశీలించాలి. అమెరికాలోనూ స్టాంపింగ్ చేసే సదుపాయం కల్పించాలి. గడువు ముగిసిన వీసాతో అమెరికాలోకి అనుమతించాలి. తమ స్వదేశాల్లో స్టాంపింగ్ అవ్వకుండానే అమెరికాలోకి ప్రవేశం కల్పించాలి.
హెచ్-1బీ వీసా అంటే?
'హెచ్-1బీ' అనేది వలసేతర వీసా. నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఈ వీసా విధానం అమెరికా కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దాని ద్వారా భారత్, చైనా తదితర దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అమెరికా వెళ్లగలుగుతున్నారు.