Global Warming And Climate Change : కొన్నేళ్ల క్రితం నుంచి భూమి మండిపోతోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది రెండుసార్లు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19వ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి.. అత్యంత వేడి నమోదైన ఐదో సంవత్సరంగా 2022 నిలిచింది. ఎల్‌నినో ఏర్పడడమే ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణంగా నిపుణులు భావిస్తున్నారు. వాతావరణ మార్పులే అధిక ఉష్ణోగ్రతలకు కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణమండల పసిఫిక్‌లో చాలావరకు ఉపరితల సముద్రం వేడెక్కుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనివల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.1 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.2 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుందని అంచనా వేశారు. కానీ ఈ అధిక ఉష్ణోగ్రతలకు ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని వారు వివరిస్తున్నారు. పర్యావరణ కాలుష్యం పెరగడం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020 నుంచి ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమ నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు అంతర్జాతీయ ఒప్పందం ఉంది. మరోవైపు సౌర కుటుంబంలో మార్పులు కూడా ఉష్ణోగ్రత పెరగడానికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల సూర్యుడి శక్తిలో ఎక్కువ భాగం భూమి ఉపరితలంపైకి నేరుగా చేరుతుందని వివరించారు. 2019 చివరి నుంచి సూర్యుడిలో మార్పులు సంభవిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో జనవరి 15, 2022న హుంగా టోంగా అగ్ని పర్వతం బద్దలవ్వడం కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు. టోంగా అగ్నిపర్వతం పేలుడు ముందు హిరోషిమా అణువిస్ఫోటనం కూడా చిన్నదే అని నాసా కూడా వెల్లడించింది. ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అత్యంత భారీ శక్తి విడుదలైందని, నాడు హిరోషిమా నగరంపై అమెరికా జారవిడిచిన అణుబాంబు కంటే ఇది వందలాది రెట్లు అధికమని నాసా తెలిపింది. ఈ అగ్ని పర్వతం విస్ఫోటనంతో 30 మిలియన్ టన్నుల శక్తి విడుదలై ఉంటుందని తెలిపింది. ఇది రెండేళ్ల క్రితం జరిగినప్పటికీ గ్రహం వేడేక్కేందుకు ఇప్పటికీ ప్రభావం చూపుతోందని పరిశోధకులు వెల్లడించారు.
World Hottest Day 2023 : చరిత్రలోనే అత్యంత వేడి రోజు! ఎంత నమోదైందంటే?
నిప్పులు కక్కుతున్న సూరీడు.. అల్లాడుతున్న అమెరికన్లు.. ఎందుకిలా?