Mexico gang violence: మెక్సికోలో గ్యాంగ్ వార్ జరిగింది. సియూడాడ్ వారెజ్లో చెలరేగిన ఈ ఘర్షణల్లో రేడియో ఉద్యోగులతో సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో సాధారణ పౌరులు ఉన్నారు. ఒక దుకాణం వెలుపల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న రేడియో ఉద్యోగులు నలుగురు.. మెక్సికల్ గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో మరణించారు. మెక్సికల్స్ గ్యాంగ్ అంతకుముందు రోజు గురువారం మెక్సికో సరిహద్దులోని ఓ జైల్లో దాడి చేసింది. ఆ దాడిలో ఇద్దరు ఖైదీలు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారు. అనంతరం అల్లర్లు వీధులకు వ్యాపించాయి. దీంతో ఈ గ్యాంగ్ వార్‌లో మొత్తం ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం మెక్సికల్ ముఠా సియుడాడ్ వీధుల్లోకి ప్రవేశించి వ్యాపార సముదాయాలను తగలబెట్టడం, సాధారణ పౌరులపై కాల్పులు జరపడం చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడార్ విచారం వ్యక్తం చేశారు. అమాయక పౌరులపై దాడులకు పాల్పడడం దారుణమని అన్నారు. ఇది రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ కాస్త సాధారణ పౌరులపై కాల్పులు జరిపే స్థాయికి చేరుకుందని లోపెజ్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్‌పై దృష్టి