G20 African Union : ప్రపంచ జీడీపీలో 85శాతం వాటా కలిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు దిల్లీలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ క్రమంలో భారత్ ప్రతిపాదించిన ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వాన్ని సభ్యదేశాలన్నీ అంగీకరించడం కీలక పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. 55కు పైగా దేశాలు ఉన్న ఆఫ్రికా యూనియన్‌లో 2050 నాటికి జనాభా దాదాపు 250 కోట్లకు చేరనుంది. జీ20 కూటమిలో ఇప్పటి వరకు ఏయూ నుంచి కేవలం ఒక్క దక్షిణాఫ్రికా మాత్రమే సభ్య దేశంగా ఉంది. కానీ, ఇప్పుడు భారత్ చొరవ, సభ్య దేశాల అంగీకారంతో ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం పొందింది. ఈ నేపథ్యంలో శక్తిమంతమైన జీ20లో చేరడం వల్ల అటు ఆఫ్రికన్ యూనియన్‌కు.. ఇటు కూటమికి పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
G20 Summit 2023 Date : ఆఫ్రికాలో వివాదాస్పదంగా ఉన్న పశ్చిమ సహారా.. ఐరాసతో పాటు ఇతర అంతర్జాతీయ వేదికల్లో ప్రాతినిధ్యం కోసం ఒత్తిడి తెస్తోంది. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లోనూ సంస్కరణలు చేయాలని వాదిస్తోంది. అమెరికానే కాకుండా ఐరోపా దేశాలు ఆఫ్రికాలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. చైనా ఇప్పటికే ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. భారీ స్థాయిలో రుణాలు ఇచ్చే దేశంగానూ ఉంది. అటు రష్యా కూడా ఇక్కడి దేశాలకు ప్రధాన ఆయుధ సరఫరాదారుగా ఉంది. గల్ఫ్ దేశాలూ అక్కడ భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. తుర్కియే విదేశీ గడ్డపై అతిపెద్ద మిలటరీ బేస్ సోమాలియాలో ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్‌లు కూడా ఆఫ్రికా ఖండంలో తమ భాగస్వాముల కోసం అన్వేషణలో ఉన్నాయి.
యుద్ధం, తీవ్రవాదం, ఆకలి, విపత్తుల బాధిత దేశంగా ఆఫ్రికాను చిత్రీకరిస్తుండటాన్ని అక్కడి నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా కీలకమైన వనరులు, సామర్థ్యాలున్న ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించడం అంటే ఆ ఖండాన్ని ఓ ప్రపంచ శక్తిగా గుర్తించడమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. జీ20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం, ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్యానికి కేంద్రంగా మారనుంది. అంతేకాకుండా వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రపంచానికి అవసరమైన వనరులు ఈ ఖండంలో పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో 60శాతం పునరుత్పాదక శక్తి వనరులు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. ఇందుకు అవసరమైన 30శాతానికిపైగా ఖనిజాలకూ ఆఫ్రికా నిలయంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా లభించే కోబాల్ట్‌లో సగానికి పైగా కాంగోలోనే ఉన్నట్లు ఇటీవల ఐరాస నివేదిక వెల్లడించింది.
ఆఫ్రికా వనరులను ఇప్పటికే కొన్ని దేశాలు వినియోగించుకొంటూ లాభాలు పొందుతున్నాయనే వాదన ఉంది. అయితే, వీటివల్ల తమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు ఆర్థిక వ్యవస్థలకు తోడ్పడాలని స్థానిక నేతలు కోరుకుంటున్నారు.ఎంతో విలువైన తమ సహజ వనరులను పరిగణనలోకి తీసుకోవాలని కెన్యా అధ్యక్షుడు విలియం రుటో ఇటీవలే పేర్కొన్నారు.