France protests update today : దేశవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించినప్పటికీ నిరసనకారులను అదుపు చేయడం కష‌్టంగా మారింది. పట్టపగలే కొందరు కొందరు తీవ్రస్థాయిలో హింసకు పాల్పడుతున్నారు. పారిస్ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలను లూటీ చేస్తున్నారు. శుక్రవారం స్ట్రాస్‌బర్గ్‌లోని యాపిల్ స్టోర్ లోపలకు నిరసనకారులు చొరబడి.. అక్కడి సామగ్రిని దోచుకెళ్లారు. పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. మర్సీలీలోని ఓ తుపాకుల దుకాణంలోనూ దుండగులు లూటీకి పాల్పడ్డారు. కొన్ని ఆయుధాలను ఎత్తుకెళ్లారు.
France protest reason : ఆందోళనకారుల్లో యువతే ఎక్కువగా ఉండడం ఫ్రెంచ్ పాలకులను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో టీనేజర్లను ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కోరారు. 17 ఏళ్ల నహేల్ అనే యువకుడిని ట్రాఫిక్ తనిఖీల సమయంలో పోలీసులు కాల్చడం వల్ల దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లను అణచడానికి సోషల్ మీడియాపై ఆంక్షలను ప్రతిపాదించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. హింసాకాండకు ఆజ్యం పోయడంలో స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషించాయని ఆయన ఆరోపించారు. సమస్యాత్మక కంటెంట్‌ను తొలగించడానికి నిబంధనలు రూపొందిస్తామని మాక్రాన్ చెప్పారు. అల్లర్లలో పాల్గొని గురువారం అరెస్టైన వారిలో మూడింట ఒక వంతు యువకులేనని అధ్యక్షుడు వెల్లడించారు. ఫ్రాన్స్‌లో అత్యవసర స్థితితో పాటు, శాంతి పునరుద్ధణకు చేపట్టాల్సిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు.. ఫ్రెంచ్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ తెలిపారు.
France protest nahel : ఆందోళనకారులు మాత్రం ఫ్రెంచ్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఫ్రాన్స్‌లో ఇలా ట్రాఫిక్ తనిఖీల సమయంలో కాల్చిచంపడం కొత్తేమీ కాదని ఆందోళనలు చేస్తున్నారు. 2022 ఒక్క సంవత్సరంలోనే 13 మందిని తనిఖీల సమయంలో పోలీసులు కాల్చిచంపారని వారు చెప్పారు. ఈ ఏడాది నహెల్ అనే యువకుడిని కాల్చి చంపడానికి ముందు మరో ముగ్గురిని ఇలాగే కాల్చిచంపారని ఆందోళనకారులు ఆరోపించారు. వచ్చే ఏడాది పారిస్‌లో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళనలు ఆ దేశాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
France protests 2023 : ఫ్రాన్స్ అల్లర్ల నేపథ్యంలో 875 మందిపైగా నిరనసకారులను పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో 200 మంది పోలీసులు గాయపడ్డారు. నహేల్‌ను కాల్చి చంపిన నాన్‌టెర్రేలో సాయుధ బలగాల వాహనాలను తగలబెట్టారు. ఈ హింస క్రమంగా బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ వరకు విస్తరించింది. అక్కడ కూడా డజను మందిని అరెస్ట్ చేశారు. క్లిచి-సౌస్-బోయిస్‌లో సిటీ హాల్, ఆబర్‌విల్లియర్స్‌లో బస్ డిపోకు నిప్పుపెట్టారు. భద్రతా దళాలపై టపాసులు ప్రయోగించారు. ట్వెల్త్‌జిల్లాలో పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. రివోలిస్ట్రీట్, లౌవ్రే మ్యూజియం, ప్యారిస్ అతిపెద్ద షాపింగ్ మాల్ ఫోరమ్ డెస్ హాలెస్‌లో దుకాణాలను ఆందోళనకారులు లూటీ చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు బాష్పవాయువు, జల ఫిరంగులు, స్టన్ గ్రనేడ్లను ప్రయోగించారు. 40వేల మంది పోలీసులను ప్రభుత్వం మోహరించింది.