బ్రెజిల్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 36 మంది చనిపోగా.. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర సావో పాలో రాష్ట్రంలోని పలు నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.
సావో సెబాస్టియావో నగరంలో 35 మంది మరణించగా.. పొరుగున ఉన్న ఉబాతుబాలో 7 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలిపారు. సావో సెబాస్టియావో, బెర్టియోగా నగరాల్లో జరగాల్సిన కార్నివాల్ ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సావో పాలో రాష్ట్రంలో ఒక్కరోజులోనే 600 మిల్లీ మీటర్ల వర్షం పడినట్లు అధికారులు తెలిపారు. తక్కువ సమయంలోనే అత్యధిక వర్షం పడిన సంఘటనల్లో ఇదొకటని అన్నారు. బెర్టియోగా ప్రాంతంలో 687 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన సైన్యం 2 విమానాలతో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నట్లు వివరించారు.
భారీ వరదల కారణంగా స్థానికుల ఇళ్లు మునిగిపోయాయని.. అలాగే కొండచరియలు విరిగిపడి 50 ఇళ్లు ధ్వంసమయ్యాయని సావో సెబాస్టియావో మేయర్ ఫెలిప్ అగస్టో తెలిపారు. వరదల ధాటికి అతలాకుతలమైన సావో పాలో నగరంలో పర్యటించనున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
కాంగోలో 100 మంది..
కాంగో రాజధాని కిన్‌షాసాను మూడు నెలల క్రితం భీకర వరద ముంచెత్తింది. ఈ విపత్తులో 100 మందికి పైగా పౌరులు మరణించగా.. అనేక మంది గాయపడ్డారని ప్రభుత్వం ప్రకటించింది. కిన్షాసాలో కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం, మట్టి పెళ్లలు విరిగిపడటం వంటి విపత్తులతో కోటి మందికి పైగా జనాభా ఉన్న కిన్‌షాసా చిగురుటాకులా వణికింది. అనుమతులు లేకుండా నిర్మించిన ఇళ్లలో నివసిస్తున్నవారే వరద ప్రకోపానికి గురయ్యారని అధికారులు తెలిపారు.
భూకంపానికి 46 వేల మంది బలి..
ఇటీవల తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపం వల్ల దాదాపు 46,000 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది బిక్కుబిక్కుమంటూ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తుర్కియేలో కనీసం తమవారి శవాలైనా దొరకాలని బాధిత కుటుంబాలు కోరుకుంటున్నాయి. అనేక మంది తమవారి కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సహాయక చర్యల్లో ఒకరో ఇద్దరో బతికొస్తుంటే తమ వారు కూడా అలా వస్తారేమో ఆశ పడుతున్నారు. విధ్వంసం జరిగి పది రోజులు దాటినా శిథిలాల కింద ఇంకా మృతదేహాలు లభ్యమవుతున్నాయి.