EU On Israel Palestine Conflict : గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడుల నుంచి తప్పించుకునేందుకు హమాస్ మిలిటెంట్లు పౌరులను, ఆస్పత్రులను రక్షణ కవచాలుగా వినియోగిస్తోందని ఇజ్రాయెల్ సహా ఐరోపా దేశాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై స్పందించిన యూరోపియన్ యూనియన్.. హమాస్ చర్యలను ఖండించింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి పౌరులు భద్రంగా వెళ్లేలా చూడాలని... హమాస్‌కు సూచించింది. ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో మరింత సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌ను కోరింది ఐరోపా సమాఖ్య. ఆస్పత్రులు, పౌరులను రక్షణ కవచాలుగా ఉపయోగిచుకోవడంపై... ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం బాధ్యతగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని రక్షించడానికి, మందుల సరఫరా చేసేందుకు ఆటంకం కలిగించకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సదుపాయం కావాల్సిన రోగులను భద్రంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా చూడాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. ఇలాంటి శత్రుత్వాలు ఆసుపత్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, పౌరులు, వైద్య సిబ్బంది తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
Israel Hamas War : ఉత్తర గాజాలో ఉన్న పలు ఆసుపత్రులను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి. వీటిలో గాజాలో అతిపెద్దదైన అల్-షిఫా, రెండో అతిపెద్దదైన అల్-ఖుద్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దళాలు పలు ఆసుపత్రులను చుట్టుముట్టడం వల్ల వైద్యపరికరాలు, మందుల సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హమాస్ మిలిటెంట్లు పలువురిని రక్షణ కవచాలుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. ఆస్పత్రుల కింద, సమీప ప్రాంతాల్లో హమాస్ కమాండ్ సెంటర్లు ఏర్పాటు చేసిందని తెలిపింది. ఆస్పత్రులు సాధారణంగా నడిచేందుకు తాము ఇంధనాన్ని ఇచ్చినా హమాస్ మిలిటెంట్లు నిరాకరించారని ఇజ్రాయెల్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో పెద్ద పెద్ద డబ్బాల్లో ఇంధనాన్ని ఆస్పత్రికి తరలిస్తున్న ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండించింది. నెతన్యాహు బలగాలు ఆస్పత్రులు, సామాన్యులపై దాడులు చేస్తున్నాయని ఆరోపించింది.
గాజా ఆరోగ్య పరిస్థితులపై WHO ఆందోళన
గాజాలోని ప్రధాన ఆసుపత్రి అల్-షిఫాలో భయంకరమైన, ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అల్-షిఫా ఆస్పత్రిలో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని.. ఆహారం, నీటి కొరత పతాకస్థాయికి చేరిందని WHO వెల్లడించింది. ఆసుపత్రి వద్ద నిరంతర కాల్పులు, బాంబు దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అల్ ఫిషాలో ఇక వైద్య సేవలు అందించడం కష్టమేనని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు. అల్ షిఫా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఉన్న నవజాత శిశువులను మరొక ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేయడానికి WHO సిద్ధంగా ఉందని అధనోమ్ వెల్లడించారు
'బందీలను వదిలేవరకు దాడులు ఆపేదే లేదు'
మరోవైపు హమాస్ బందీలుగా తీసుకెళ్లిన ఇజ్రాయెల్ పౌరులను వదిలేవరకు దాడులను ఆపేదే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇప్పటికే ఉత్తరగాజాపై హమాస్ పట్టు కోల్పోయిందని వెల్లడించారు. ఉత్తర గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్ షిఫా ఆస్పత్రిని ఇప్పటికే చుట్టుముట్టామన్న నెతన్యాహు... తమ ఆపరేషన్ లక్ష్యమే బందీలను విడిపించడమని వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు హమాస్‌కు వ్యతిరేకంగా నిలబడాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. హమాస్‌పై పోరాటంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గదని.. దానిని హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు. గాజాపై దాడిని విరమించాలని ప్రపంచదేశాలు కోరుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇజ్రాయెల్ ముందుకుపోతోంది.
బిక్కుబిక్కుమంటూ 14వేల మంది- ఆస్పత్రిలో కరెంట్ కట్, జనరేటర్ కూడా లేక
యుద్ధం తర్వాత గాజాను పాలించేదెవరు? కాల్పుల విరమణకు నెతన్యాహూ నో