Downing street crash : అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి సమీపంలో ట్రక్కు దాడి మరవకవముందే.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక నివాసంపై కూడా ఈ తరహా ఘటన జరగడం కలకలం రేపింది. లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ గేట్‌ను.. ఓ వ్యక్తి కారుతో ఢీ కొట్టడం సహా నేరపూరిత నష్టం కలిగించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.20 సమయంలో జరిగిందని వెల్లడించారు. అయితే ఇది ఉగ్ర కుట్ర కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
10 డౌనింగ్ స్ట్రీట్ గేటును కారు ఢీకొన్న వెంటనే భద్రతా సిబ్బంది ఆ వీధిలో వాహనాల రాకపోకలను నిలిపివేసి.. ఇంకా ఎవరైనా దుండగులు ఉన్నారేమోనని తనిఖీలు చేపట్టారు. అనుమానించాల్సిన పరిస్థితి కనపడకపోవడం వల్ల దిగ్బంధాన్ని తొలగించారు. కారు దాడి జరిగిన సమయంలో రిషి సునాక్ తన కార్యాలయంలో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఘటన జరిగిన కొద్ది సమయం వరకూ అధికారులెవరూ బయటకు రావొద్దని పోలీసులు ఆదేశించారు.
![Britain pm rishi sunak official residence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18597572_tt.jpg)
బ్రిటన్ ప్రధాని నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ ముందు ఎల్లవేళలా గట్టి బందోబస్తు ఉంటుంది. రక్షణ వ్యవస్థలో భాగంగా బలమైన ఇనుప గేట్లు ఉంటాయి. బ్రిటన్ పార్లమెంట్‌కు 10 డౌనింగ్ స్ట్రీట్ షార్ట్‌కట్ మార్గం. డౌనింగ్ స్ట్రీట్ ప్రవేశంలో 1989లోనే భారీ గేట్లను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ లండన్‌లో బాంబు దాడులకు పాల్పడటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. 1991లో అప్పటి ప్రధాని నివాసంపై మరోసారి మోర్టార్ షెల్స్‌తో దాడి జరిగింది. వీటిని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగిస్తున్నారు. తొలి రక్షణ వలయంగా భారీ గేట్లు, భద్రతా సిబ్బంది ఉంటారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ మార్గంలోకి కారు వెళ్లేందుకు అనుమతిస్తారు. అయితే తాజా ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్ర దాడి కాకపోవచ్చని భావిస్తున్నారు.
![Britain pm rishi sunak official residence](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18597572_pp-1.jpg)
వైట్ హౌస్‌పై దాడి..
White House Attack By Indian : ఇటీవల(మే 22న) అమెరికాలోని వైట్ హౌస్ పరిసరాల్లో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. తెలుగు సంతతికి చెందిన ఓ 19 ఏళ్ల యువకుడు ఆ దేశ అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలోని లాఫెట్ స్క్వేర్ వద్ద భద్రతా నిమిత్తం ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టి నానా హంగామా చేశాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.