US President Elections Donald Trump: అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.2024లో అగ్రరాజ్య అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నట్లు ట్రంప్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‌లో ఆయన మద్దతుదారులు పత్రాలను దాఖలు చేశారు.
అమెరికాను మళ్లీ గొప్పగా అద్భుతంగా మార్చడానికి తాను అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నట్లు అభిమానుల కోలాహలం మధ్య ట్రంప్ ప్రకటించారు. దేశాన్ని లోపల నుంచి నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న డెమోక్రాట్లను ఓడించేందుకు పోరాటం చేస్తానని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. 2024లో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బైడెన్ ఎన్నిక కాకుండా తాను చూసుకుంటానని తాను అమెరికన్ల గొంతుక అవుతానని ప్రకటించారు
"మనందరికి తెలుసు ఇది మన ముగింపు కాదు. అమెరికా కలను నెరవేర్చే పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే. అమెరికాను మళ్లీ గొప్పగా... అద్భుతంగా మార్చడానికి.. అమెరికా అధ్యక్ష పదవికి నేను మళ్లీ పోటీ చేయబోతున్నాను."
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
ఫ్లోరిడాలోని 400 మంది ప్రత్యేక ఆహ్వానితుల మధ్య 76 ఏళ్ల ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఈరోజు అత్యంత ముఖ్యమైనదిగా మారుతుందని తన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు. అమెరికా నిజమైన వైభవాన్ని ఇంకా ప్రపంచం చూడలేదన్న ట్రంప్ అది ఎలా ఉంటుందో ప్రపంచానికి చాటి చెప్తామని ప్రకటించారు. తాము అత్యున్నత లక్ష్యాలను సాధించే వరకు దేశాన్ని మునుపెన్నడూ లేని విధంగా మార్చేవరకు వదిలిపెట్టేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా భవిష్యత్తు కోసం పెద్ద ఆలోచనలు, ధైర్యమైన ఆశయాలు సాహసోపేతమైన కలలపై అమెరికాను నూతనంగా నిర్మిస్తామని ట్రంప్ ప్రకటించారు.అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా అధ్యక్ష పదివికి పోటీ చేసే విషయంలో ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
'తాను పోటీ చేయాలని భావిస్తున్నానని..'
వచ్చే ఎన్నికల్లోనూ తాను పోటీ చేయాలని భావిస్తున్నానని కానీ క్రిస్మస్-నూతన సంవత్సర సెలవుల్లో దానిపై తుది నిర్ణయం తీసుకుంటానని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు 80 ఏళ్ల బైడెన్ ఇటీవల ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి బిడ్ దాఖలు చేయడం ట్రంప్‌నకు ఇది మూడోసారి. 2016లో హిల్లరీ క్లింటన్‌పై గెలిచిన ట్రంప్ 2020లో బిడెన్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.