Cold virus children deaths: జలుబు వంటి లక్షణాలకు కారణమయ్యే ఓ సాధారణ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఏడాదే లక్ష మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు చిన్నారుల్లోనే ఈ మరణాలు అధికంగా సంభవిస్తోన్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదిక ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
రెస్పిరేటరీ సైన్‌సైటియల్ వైరస్..
చిన్నారుల్లో రెస్పిరేటరీ సైన్‌సైటియల్ వైరస్ (ఆర్‌ఎస్‌వీ) ప్రభావాన్ని అంచనా వేసేందుకు బ్రిటన్ పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్క 2019లోనే ఆరు నెలల్లోపు వయసున్న 45వేల మంది చిన్నారులు ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఎస్‌వీ వైరస్ బారిన పడుతోన్న ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోతున్నట్లు తెలిపారు. చిన్నారులు పుట్టిన 28 రోజుల నుంచి ఆరు నెలల మధ్య కాలంలోనే ఆర్‌ఎస్‌వీ మరణాల ముప్పు అధికంగా ఉందన్న నిపుణులు.. వైద్య సదుపాయం ఉన్న ప్రాంతాల్లో ముప్పు తక్కువగానే ఉందన్నారు. పేద దేశాల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.
ప్రతి ఏటా లక్ష మంది..
ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఏటా ఆర్‌ఎస్‌వీ సంబంధిత కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండగా కేవలం 2019లోనే 3.3కోట్ల కేసులు నమోదయ్యాయి. వీరిలో 36లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. అందులో 26,300 మంది ఆస్పత్రుల్లోనే మరణించగా.. ఆ ఏడాది మొత్తంగా 1,01,400 ఆర్‌ఎస్‌వీ సంబంధిత మరణాలు సంభవించినట్లు పరిశోధకులు లెక్కగట్టారు. ఆ వయసు పిల్లల్లో వివిధ రకాల కారణాలతో ప్రాణాలు కోల్పోయే ప్రతి 50 మందిలో ఒకరు ఆర్‌ఎస్‌వీ వల్లే చనిపోతున్నారు. ఇక ఈ ఏడాది (2019)లో ఆరు నెలల్లోపు వయసున్న చిన్నారుల్లో ఆర్‌ఎస్‌వీ సంబంధిత కేసులు ప్రపంచవ్యాప్తంగా 66లక్షలు వెలుగు చూడగా.. వీరిలో 14లక్షల మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో కేవలం 20శాతం మందిలోనే మరణాలు చోటుచేసుకుండగా.. కమ్యూనిటీ స్థాయిలోనే 80శాతం మరణాలు జరుగుతున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్‌ఎస్‌వీ మరణాలు అధికంగా పేద, మధ్య ఆదాయ దేశాల్లోనే సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే..
'చిన్నారుల్లో తీవ్ర శ్వాసకోస ఇన్‌ఫెక్షన్‌కు ఆర్‌ఎస్‌వీ ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఆరు నెలల చిన్నారులు, యుక్తవయసు పిల్లలకు ముప్పు అధికంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నాం' అని అధ్యయన సహ రచయిత, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌కు చెందిన నిపుణులు హరీశ్ నాయర్ పేర్కొన్నారు. 'అయితే కొవిడ్ ఆంక్షలు సడలిస్తోన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో పుట్టిన చిన్నారుల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వారు ఈ వైరస్ బారినపడలేదు. దీంతో ఈ వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత వారిలో వృద్ధి కాలేదు' అని హరీశ్ నాయర్ వెల్లడించారు. అయితే, ఈ వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు కృషి చేస్తున్నట్లు హరీశ్ నాయర్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: