చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు బుధవారంతో 69 ఏళ్లు పూర్తయ్యాయి. చైనా అధ్యక్షులు 68 ఏళ్ల వయసు దాటిన తర్వాత లేదా అయిదేళ్ల చొప్పున రెండు దఫాలు పదవిలో కొనసాగాక రిటైర్ కావడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్క మావో జెడాంగ్ తప్ప జిన్‌పింగ్‌కు ముందున్న అధ్యక్షులందరూ ఈ సంప్రదాయాన్ని పాటించారు. అయితే జిన్‌పింగ్ మాత్రం దీనికి భిన్నమైన పంథాలో వెళ్తున్నారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ)లో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన ఆయన ఈ ఏడాదితో అధ్యక్షుడిగా పదేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. అయితే మూడోసారీ అధ్యక్షుడిగా కొనసాగడానికి సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే సీపీసీ ఆయనకు మావో తరహాలో పార్టీలో అత్యంత కీలక(కోర్) నేత హోదాను కట్టబెట్టింది. దీంతోపాటు చైనా చట్ట సభ 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్' 2018లో రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్షులకు రెండు దఫాల పదవీకాల పరిమితిని ఎత్తేసింది. దీంతో పార్టీ అధినేతగా, సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా జిన్‌పింగ్ జీవితకాలం కొనసాగడానికి మార్గం సుగమమైంది. అక్టోబరులో నిర్వహించతలపెట్టిన సీపీసీ అత్యున్నత సమావేశాల్లో ఈ దిశగా లాంఛన ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: