xi Jinping Third term : షీ జిన్‌పింగ్ మరో ఐదేళ్లపాటు చైనా అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి ఎన్నికయ్యారు. అత్యంత అరుదైన ఈ ఎన్నికతో.. మావో జెడాంగ్ తరవాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా నిలిచారు జిన్‌పింగ్(69). సీపీసీ మహాసభలు శనివారం ముగిశాయి. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి షీ జిన్‌పింగ్‌కు పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధంకాగా.. ఆదివారం స్టాండింగ్ కమిటీ ఆయన పేరును అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు.. చైనా కమ్యూనిస్టు పార్టీపై ఉన్న పట్టును శనివారం మరోసారి నిరూపించుకున్నారు జిన్‌పింగ్. పార్టీలో తన తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశ ప్రధాని, పొలిట్‌బ్యూరోతో పాటు స్టాండింగ్ కమిటీలో సభ్యుడైన లీ కెకియాంగ్‌కు ఉద్వాసన పలికారు. మరో ముగ్గురు సీనియర్ నేతలను కూడా పార్టీ కేంద్ర కమిటీ నుంచి తొలగించారు.
చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ.. ఆదివారం సమావేశమై 25 మంది నాయకులతో పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంది. చైనా అధ్యక్ష పదవీ విరమణ వయసు 68 అయినప్పటికీ.. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన నేపథ్యంలో జిన్‌పింగ్ కొనసాగుతున్నారు. ఒక వ్యక్తి రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ వల్ల జిన్‌పింగ్‌కు మార్గం సుగమం అయ్యింది.
ఇవీ చదవండి: సవాళ్ల మధ్య బైడెన్‌కు 'మధ్యంతర పరీక్ష'.. నిలబడతారా?
యుద్ధ తంత్రం మార్చిన రష్యా.. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు.. గాఢాంధకారంలో ఉక్రెయిన్!