China Population Decline : చైనా జనాభా వరుసగా రెండో ఏడాది క్షీణించింది. జననాలతో పోలిస్తే మరణాలు అధికంగా నమోదవుతుండటం వల్ల 2023లో జనాభా 20 లక్షల మేర తగ్గింది. కరోనా ఆంక్షలు ఎత్తేయడం వల్ల మరణాలు పెరిగినట్లు చైనా ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే మొత్తం మరణాల సంఖ్య రెట్టింపు అయింది. 2023లో ఏకంగా 6 లక్షల 90వేల మరణాలు సంభవించాయి. 2022 చివర్లో మొదలైన కరోనా తీవ్రత 2023 ఫిబ్రవరి వరకు కొనసాగింది. ఈ కాలంలో మరణాలు పెరిగినట్లు చైనా తెలిపింది. దేశ మొత్తం జనాభా 140 కోట్లుగా ఉన్నట్లు గణాంక కార్యాలయం స్పష్టం చేసింది.
ఇక ఎప్పటిలాగే జననాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. 2023లో 90 లక్షల మంది జన్మించారు. 2016లో పుట్టిన శిశువుల సంఖ్యలో ఇది సగమేనని చైనా గణాంక కార్యాలయం పేర్కొంది. వరుసగా ఏడో సంవత్సరం జననాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. దేశంలో ఎంతో కాలంగా ఉన్న సామాజిక పరిస్థితుల కారణంగా పిల్లల్ని కనేందుకు జంటలు ముందుకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు, దేశ జనాభా సగటు వయసు క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే సూచనలు కనిపిస్తున్నాయి. వృద్ధుల సంఖ్య పెరగడం, శ్రామిక జనాభా తగ్గడం వల్ల అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.
వన్ చైల్డ్ పాలసీ ఉపసంహరణ
జనాభాను నియంత్రించేందుకు చైనా గతంలో వన్ చైల్డ్ పాలసీని పాటించింది. ఒకే శిశువును కనాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ విధానంతో జననాలు భారీగా తగ్గిపోయాయి. అయితే, వృద్ధుల జనాభా పెరిగి శ్రామిక జనాభా తగ్గిపోతుండటం చైనాకు కొత్త తలనొప్పిగా మారింది. పూర్తి విరుద్ధమైన ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు 2016లో వన్ చైల్డ్ పాలసీకి స్వస్తి చెప్పింది. జననాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
అయితే, చైనా ప్రజలు మాత్రం పిల్లల్ని కనేందుకు వెనకడుగు వేస్తున్నారు. అనేక మంది యువత ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. పెళ్లి అయిన వారు సైతం పిల్లల్ని కనేందుకు తటపటాయిస్తున్నారు. ఒకే ఒక సంతానానికి పరిమితమవుతున్నారు. పిల్లల విద్యకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం సహా ఇతర కారణాల వల్ల ఎక్కువ మందిని కనేందుకు మొగ్గు చూపడం లేదు.