చైనా కొత్త ప్రధానమంత్రిగా లీ కియాంగ్ ఎన్నికయ్యారు. బీజింగ్‌లో జరుగుతున్న 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC) సమావేశాల్లో లీ కియాంగ్‌కు మద్దతుగా సభ్యులు ఓటు వేశారు. దాదాపు 3వేలమంది సభ్యులు పాల్గొన్న ఓటింగ్‌లో 2 వేల 936 మంది కియాంగ్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ముగ్గురు వ్యతిరేకంగా ఓటు వేయగా.. 8మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంతకంతో ప్రధానిగా లీ కియాంగ్ అధికారికంగా నియమితులయ్యారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కియాంగ్.. దేశ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేశారు.
జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడైన 63 ఏళ్ల లీ కియాంగ్.. కరోనా సమయంలో షాంఘై నగరంలో జీరో- కొవిడ్ విధానాన్ని క్రూరంగా అమలు చేసి బాగా ప్రసిద్ధి చెందారు. ఈ సమావేశాల్లోనే సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) వైస్ ఛైర్మన్ తోపాటు మరింత మంది కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈనెల 5న ప్రారంభమైన 14వ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NPC) సమావేశాలు 13న ముగియనున్నాయి.
కాగా, ఈ సమావేశాల్లోనే షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మూడోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా.. జిన్‌పింగ్ రికాకర్డుకెక్కారు. 68 ఏళ్లు వచ్చాయంటే చైనా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలనే నిబంధన ఇదివరకు ఉండేది. కానీ, జిన్‌పింగ్ కోసం ఆ నిబంధనను మార్చేశారు. ఇందుకోసం ఏకంగా రాజ్యాంగ సవరణ సైతం చేశారు. దీంతో పాటు ఒక వ్యక్తి రెండు కన్నా ఎక్కువ సార్లు అధ్యక్ష పదవి చేపట్టేందుకు వీలుగా నిబంధనలను సవరించారు. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు జిన్‌పింగ్.
ఎవరీ జిన్‌పింగ్?
జిన్‌పింగ్ తండ్రి రాజకీయ నాయకుడే. ఆయన తంర్డి షీ ఝాంగ్షన్.. మావో జెడాంగ్ ప్రభుత్వంలో పనిచేశారు. కీలకమైన ఉప ప్రధాని బాధ్యతలను నిర్వర్తించారు. అయితే, ఆయన ఉదారవాద విధానాలు అనుసరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఝాంగ్షన్ పదవి కోల్పోయారు. అనంతరం ఆయన్ను జైలులో పెట్టారు. ఆ సమయంలో జిన్‌పింగ్ వయసు పదమూడేళ్లే. తన తండ్రిపై వచ్చిన ఆరోపణల ప్రభావం జిన్‌పింగ్‌పై ఎక్కువగానే ఉండేది. ఆ పరిస్థితులే జిన్‌పింగ్‌ను మరింత రాటుదేలేలా చేశాయి. తీవ్రంగా ప్రయత్నించిన జిన్‌పింగ్.. చివరకు 1974లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం సంపాదించగలిగారు. 1975లో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో పట్టభద్రులయ్యారు. ఫోక్ సింగర్ పెంగ్ లియువాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. ఆమె పేరు షీ మింగ్జే. 2012లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన.. అంచెలంచెలుగా శక్తివంతమైన నేతగా ఎదిగారు. ప్రస్తుతం అధికారాలన్నీ తన గుప్పిట పెట్టుకున్నారు.