China Former Prime Minister Li Keqiang Died : చైనా మాజీ ప్రధాని, ఆర్థికవేత్త లీ కెకియాంగ్ (68) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూసినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా సేవలందించారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఆయన అత్యంత సన్నిహితుడిగా లీ కెకియాంగ్‌కు పేరుంది. ఈ ఏడాది మార్చిలో ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఆయన షాంఘైలో విశ్రాంతి తీసుకొంటున్నారు.
జిన్‌పింగ్ అలా చేయకపోతే.. చైనా అధ్యక్షుడిగా..
జిన్‌పింగ్ అధ్యక్ష పదవీకాలం మూడోసారి పొడిగించకపోతే.. లీ కెకియాంగ్ ఆ స్థానానికి పోటీపడే ప్రధాన వ్యక్తుల్లో ఒకరు. జిన్‌పింగ్ తర్వాత ఆ స్థాయి నేతగా గుర్తింపు పొందారు. అయితే జిన్‌పింగ్ మూడోసారి అద్యక్ష బాధ్యతలు చేపట్టి అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన తర్వాత ఆయన ప్రభావం సన్నగిల్లింది. ఇక ఈ ఏడాది ఆయన్ను పక్కనపెట్టి.. లీ చియాంగ్‌ను ప్రధానిగా చేశారు జిన్‌పింగ్.
ఇంజినీర్ల ఆధిపత్యంలో.. ఎకనామిస్ట్!
పేకింగ్ యూనివర్శిటీలో లీ కెకియాంగ్ ఆర్థికవేత్తగా పనిచేశారు. స్వేచ్ఛా మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను లీ కెకియాంగ్ సమర్థించేవారు. కానీ, అందుకు భిన్నంగా జిన్‌పింగ్ మాత్రం మార్కెట్‌పై పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకొనేవారు. గత మార్చిలో లీ కెకియాంగ్ చివరిసారిగా ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడారు. 'అంతర్జాతీయంగా పరిస్థితులు ఎంతగా మారినా.. చైనా అభివృద్ధి మాత్రం ఆగదు. యాంగ్జీ, యెల్లో నదులు వెనక్కి పారడం జరగదు' అని లీ అన్నారు. 2020లో ఓ సందర్భంలో.. 'చైనాలో 60 కోట్ల మంది ప్రజలు నెలకు కేవలం 140 డాలర్లతో జీవనం సాగిస్తున్నారు' అని లీ వ్యాఖ్యానించారు. కెకియాంగ్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశంలోని ఆర్థిక అసమానతలపై చర్చకు దారితీశాయి. 'చైనాలో ఆర్థిక సమస్యలను గుర్తించడం అంటే.. పరిష్కారాలను వెతకడమనే' అని కెకియాంగ్ చెప్పారు. అయితే సాధారణంగా చైనా కమ్యూనిస్ట్ పార్టీ- సీసీపీలో ఇంజినీర్ల ఆధిపత్యం ఎక్కువుంటుంది. కానీ, లీ కెకియాంగ్ ఆర్థిక వేత్త కావడం గమనార్హం.
చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లో గల ఓ కమ్యూనిస్టు పార్టీ అధికారి ఇంట్లో 1955 జులై 1న లీ కెకియాంగ్ జన్మించారు. 1976లో స్థానికంగా అధికార పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. దేశంలో సాంస్కృతిక విప్లవం సమయంలో లీ పొలం పనులు చేసేవారు. కానీ, ఆ తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీలో లీ రెండో శక్తిమంతమైన నేతగా ఎదిగారు.
China Minister Removed : చైనా రక్షణ మంత్రి తొలగింపు.. 2నెలలుగా కనిపించకుండా పోయారని..
China Birth Rate 2023 : ప్రపంచంలోనే వృద్ధ దేశంగా చైనా!.. భారీగా తగ్గిన జననాలు.. డ్రాగన్ కలవరం