China Evergrande Files For Bankruptcy : చైనాలో ముదిరిపోయిన రియల్ ఎస్టేట్ సంక్షోభం మెల్లగా బయటపడుతోంది. దేశంలోనే రెండో అతి పెద్ద రియల్ ఎస్టేట్ దిగ్గజ అయిన ఎవర్‌గ్రాండే.. దివాలా పత్రాలను న్యూయార్క్‌లో రెగ్యులరేటరీ వద్ద మంగళవారం దాఖలు చేసింది. ఈ సంస్థ అప్పులు మొత్తం దాదాపు 340 బిలియన్ డాలర్లు అని సమాచారం. అంటే చైనా జీడీపీలో 2.437 శాతానికి సమానం.
దివాలా కేసు మరో దేశంతో సంబంధం ఉన్నప్పుడు అమెరికా కోర్టులు సమన్వయం చేసుకొనేలా చాప్టర్-15 దివాలా పిటిషన్‌ను ఫైల్ చేసింది ఎవర్‌గ్రాండే. ఇది అమెరికా రుణదాతలు బయట దేశాల్లోని కోర్టులతో సమన్వయం చేసుకొనేందుకు బాగా ఉపయోగపడుతుంది. దివాలా పత్రాలపై ఎవర్‌గ్రాండే విదేశీ ప్రతినిధి హోదాలో జిమ్మీవాంగ్ సంతకం చేశారు. అయితే దివాలా పిటిషన్‌పై ఎవర్‌గ్రాండే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కొండంత సంస్థ కుదేల్..
China Evergrande Collapse : ఎవర్‌గ్రాండే సంస్థ.. దేశంలో ఏకంగా 280 నగరాల్లో 1300 భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను చేపడుతోంది. వీటితోపాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హెల్త్‌కేర్, థీమ్‌పార్క్‌లను నిర్వహిస్తోంది. 2021లో ఎవర్‌గ్రాండే సంస్థ.. రుణాలు చెల్లించలేకపోయింది. రెండేళ్లలో భారీ నష్టాలను చవిచూసినట్లు.. జులైలో పేర్కొంది. దాదాపు 81 బిలియన్ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నష్టం వచ్చినట్లు ప్రకటించింది. ఇంకా ఈ సంస్థ.. డబ్బులు చెల్లించిన దాదాపు 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి అందించాల్సి ఉంది.
2023 మొదట్లో రుణ పునర్‌వ్యవస్థీకరణ కోసం యత్నిస్తున్నట్లు ఎవర్‌గ్రాండే పేర్కొంది. ఇది చైనాలోనే అతిపెద్ద రుణ పునర్‌వ్యవస్థీకరణ కానుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ సంస్థ బాండ్లు కొనుగోలు చేసినవారితో ఒప్పందాలు చేసుకొంది. కంపెనీ తిరిగి పుంజుకొనేందుకు వీలుగా విదేశీ అప్పుల ఒత్తిడిని ఇది తగ్గిస్తుందని నియంత్రణ సంస్థలకు చెప్పింది. వచ్చే మూడేళ్లలో కార్యకలాపాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని భావిస్తోంది. 43 బిలియన్ డాలర్ల రుణం అవసరం కాగా.. నిధులు అందకపోతే తన ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ యూనిట్‌ను మూసివేయాల్సి రావచ్చని కంపెనీ చెబుతోంది.
చైనాకు గట్టి దెబ్బ..
China Real Estate Crisis Evergrande : చైనా జీడీపీలో రియల్‌ఎస్టేట్ రంగానికి దాదాపు 30 శాతం వాటా ఉంది. 2021లో ఎవర్‌గ్రాండే ఆర్థిక కష్టాలు ఆ దేశ స్థిరాస్తి రంగాన్ని కుదిపేశాయి. ఒక్కసారిగా గృహ కొనుగోలుదారులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారానికి చైనా ప్రభుత్వ దుందుడుకు వైఖరే కారణంగా మారింది.
స్థిరాస్తి రంగం రుణ సమీకరణపై ఒక్కసారిగా కఠిన నిబంధనలు విధించింది. దీంతో ఎవర్‌గ్రాండే వంటి దిగ్గజ సంస్థలకు నగదు లభించడం కష్టంగా మారిపోయింది. తొలుత ఎవర్‌గ్రాండే ఆర్థిక కష్టాలు బయటపడటం వల్ల ఆ దేశ స్థిరాస్తి రంగ డొల్లతనం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కాసియా, ఫాంటాసియా, షిమావో సంస్థలు దివాలా ప్రకటించాయి. ఇటీవల ఆ దేశానికి చెందిన కంట్రీ గ్రాండ్ కూడా విదేశీ బాండ్ల టోకెన్ మొత్తాలు చెల్లించలేకపోయింది. దీంతో ఈ సంస్థ అప్పుల పునర్ వ్యవస్థీకరణకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కంపెనీని నష్టాల బారి నుంచి బయటపడేయటానికి ఛైర్మన్ యాంగ్ హుయాన్ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఈ సంస్థ రేటింగ్‌ను తగ్గించింది. నగదు కోసం కంట్రీగార్డెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది.
చైనాకు ఆర్థిక కష్టాలు..
మరోవైపు, చైనాలో ఎగుమతులు గణనీయంగా పడిపోయాయి. కొవిడ్ అనంతరం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 3.7శాతం మాత్రమే నమోదై నిరాశపర్చింది. ఈ వృద్ధిరేటు జూన్‌లో 4.4శాతంగా ఉండగా.. ముఖ్యంగా జూన్‌లో రిటైల్ విక్రయాల వృద్ధి 2.5 శాతంగానే ఉంది. దీనికి తోడు అక్కడ ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడి ధరలు పడిపోతున్నాయి. నిరుద్యోగ రేటు గత ఆరు నెలలుగా నిలకడగా పెరగడం కూడా కొనుగోళ్లు తగ్గడానికి కారణమైంది. చైనాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలిసారి నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగిందని వార్తలొచ్చాయి. ఇక 16-24 ఏళ్ల మధ్యలోని వారిలో నిరుద్యోగ రేటు గత ఆరు నెలలుగా నిలకడగా పెరుగుతోంది. ఒక్క జూన్‌లోనే 21.3 శాతం వృద్ధి చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యువ నిరుద్యోగుల డేటాను వెల్లడించకూడదని చైనా నిర్ణయించింది.
Malaysia Plane Crash : హైవేపై కూలిన విమానం.. కారు, బైక్‌తో ఢీ.. 10 మంది మృతి
హవాయి నుంచి కెనడాకు కార్చిచ్చులు.. సిటీ మొత్తం ఖాళీ చేయిస్తున్న ప్రభుత్వం