China drills Taiwan: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనకు ప్రతీకారంగా తైవాన్‌ను అష్టదిగ్భంధనం చేసిన చైనా మరింత రెచ్చిపోతోంది. తైవాన్ చుట్టూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను ప్రారంభించింది. స్వతంత్ర ప్రాంతంగా మనుగడ సాగిస్తున్న తైవాన్‌ను ప్రధాన భూభాగంలో కలుపుకునేందుకు ఎప్పటి నుంచో చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్ మాత్రం స్వతంత్ర దేశంగానే ఉండాలని కోరుకుంటోంది.
China Taiwan conflict: ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అది ఇష్టంలేని చైనా తరచూ కవ్వింపులకు పాల్పడుతోంది. వద్దన్నా సరే... పెలోసీ తైవాన్‌లో పర్యటించడంతో డ్రాగన్ దేశం రగిలిపోతోంది. వివిధ కారణాల సాకుతో తైవాన్ నుంచి పలు దిగుమతులపై నిషేధం విధించింది. చైనా నుంచి ఇసుక ఎగుమతులను నిలిపివేసింది.
తాజాగా తైవాన్‌ను చుట్టిముట్టిన చైనా సైన్యం, వైమానికదళం, నౌకాదళం, వివిధ అనుబంధ బలగాలతో కలిసి భారీ ఎత్తున సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాలు తైవాన్ ప్రాదేశిక జలాల్లోనూ జరుగుతున్నాయి. లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యం అని చైనా అధికారిక వార్తా ఏజెన్సీ షిన్హువా పేర్కొంది. గురువారం నుంచి ఆదివారం వరకు ఈ డ్రిల్స్ కొనసాగనున్నాయి. లక్ష్యాలపై మిస్సైల్స్ ప్రయోగించడం కూడా డ్రిల్స్‌లో భాగమని తెలుస్తోంది.
అమెరికా, తైవాన్ అలర్ట్!
ఈ నేపథ్యంలో తైవాన్ సైతం అప్రమత్తమైంది. తమ దేశ సైన్యాన్ని హైఅలర్ట్ చేసింది. సివిల్ డిఫెన్స్ డ్రిల్స్‌ను చేపడుతోంది. అమెరికా నావికాదళం తైవాన్‌కు సమీపంలో పలు నౌకలను మోహరించింది. తైవాన్‌కు అండగా నిలుస్తామని అమెరికా పదేపదే చెబుతున్న నేపథ్యంలో.. తాజా పరిణామాలను ప్రపంచదేశాలు తీక్షణంగా గమనిస్తున్నాయి.