China Defence Minister Missing : దాదాపు నెలరోజుల నుంచి చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు ఆచూకీ లేకపోవటంపై.. ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. రక్షణ మంత్రి లీ అదృశ్యానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి హు కియాన్ తెలిపారు. రక్షణ మంత్రి లీ షాంగ్ఫుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందా, ఆయనే రక్షణ మంత్రిగా ఉన్నారా అని విదేశీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. ఆయన ఏకవాఖ్య సమాధానం ఇచ్చారు. రక్షణ మంత్రి కనిపించకుండా పోవటానికి కారణాలు తనకు తెలియదని.. ఆయన తెలిపారు.
China Defence Minister Li Shangfu : మార్చిలో కొత్తగా ఏర్పడిన చైనా కేబినెట్‌లో రక్షణ శాఖ పగ్గాలు చేపట్టిన లీ షాంగ్ఫు.. ఆగస్టులో జరిగిన ఆఫ్రికా-చైనా సదస్సులో పాల్గొన్న తర్వాత నుంచి కనిపించటంలేదు. జులైలో తొలగించిన విదేశాంగ శాఖ మాజీ మంత్రి కిన్ గాంగ్ తర్వాత.. ఈ ఏడాది కనిపించకుండా పోయిన రెండో సీనియర్ మంత్రి లీ షాంగ్ఫు. విదేశాంగ శాఖ మంత్రి కిన్‌గాంగ్‌ను ఎందుకు తప్పించారని కానీ, ఆయనతోపాటు లీ ఆకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండాపోయారనే విషయంపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
చైనా విదేశాంగ, రక్షణ విధానాల్లో మార్పులకు మంత్రుల అదృశ్యమే సంకేతమని పేర్కొనటానికి ఇప్పటివరకు ఎలాంటి సూచనలు కూడా లేవు. ఎలాంటి కారణం లేకుండా ఉన్నతాధికారులు, ఇతరులు అదృశ్యం కావటం చైనాలో చాలా సాధారణ అంశంగా మారింది. కొన్ని నెలల తర్వాత అదృశ్యమైన వారిపై నేరాభియోగాలు ఉన్నాయనే ప్రకటన వెలువడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇద్దరు మంత్రులు వెనువెంటనే కనిపించకుండా పోవడం మాత్రం అసాధారణమని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చైనాలో మంత్రుల అదృశ్యంపై అమెరికా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కేబినెట్ ఇప్పుడు అగాథా క్రిస్టీ నవల 'దెన్ దేర్ వర్ నన్'ను పోలినట్లు ఉందని జపాన్‌లోని అమెరికా రాయబారి ఇమాన్యుయెల్ ఈనెల ప్రారంభంలో ట్వీట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి హుకియాన్ తోసిపుచ్చారు. అమెరికా-చైనా మిలిటరీ మధ్య సమాచార మార్గాలు లేవన్నారు. ఇరుదేశాల మధ్య సమస్యకు సమాచార లోపం కాదని, మిలిటరీ సంబంధాల పునరుద్ధరణకు అమెరికా తన విధానాలు మార్చుకోవాలని హు కియాన్ సూచించారు. అయితే వచ్చేనెలలో బీజింగ్‌లో జరిగే ప్రపంచ భద్రతా సదస్సుకు చైనా రక్షణ మంత్రి లీ హాజరవుతారా అని విదేశీ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ అధికార ప్రతినిధి హు కియాన్ సమాధానం దాటవేశారు. త్వరలోనే ప్రపంచ భద్రతా సదస్సుకు సంబంధించిన సమాచారం.. వెల్లడిస్తామని పేర్కొన్నారు.
చారిత్రక తీర్మానానికి సీపీసీ ఆమోదం- మళ్లీ జిన్‌పింగ్‌కే పగ్గాలు
'సరిహద్దులో శాంతి లేకుంటే సత్సంబంధాలు కష్టమే'... చైనాకు రాజ్‌నాథ్ గట్టి సందేశం